నిరోధ్లో మొబైల్ పెట్టి పావురం వీపుపై కట్టి..
అది తూర్పు కొలంబియాలోని కాంబిటా జైలు. ఎత్తయిన గోడ.. దానికి కరెంటు సరఫరాతో ఫెన్సింగ్.. జైలు లోపలాబయటా కాపలాదారులు. ఓ రకంగా చెప్పాలంటే చీమ కూడా లోపలికి దూరనివ్వనింత పటిష్టమైన భద్రతగల విశాలమైన జైలు ప్రాంగణం. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. అందులో ఉండేవాళ్లంతా ఏదో ఒక నేరాల్లో ఉన్న ఖైదీలే ముఖ్యంగా బందిపోట్లు.. డ్రగ్స్ బారిన పడిన వారు.. లైంగిక దాడులకు దిగేవారు.
సుదీర్ఘకాలం జైలు శిక్షపడితేనే ఖైదీలను ఈ జైలుకు తరలిస్తారు. అలాంటి భద్రతగల జైలులోని ఖైదీకి సహాయం చేసేందుకు ఓ పావురం ఎగిరొచ్చింది. వీపుపై ఓ మొబైల్ ఫోన్.. అందులో ఓ పెన్ డ్రైవ్ మోసుకొచ్చింది. అయితే, దాని ప్రయత్నానికి మధ్యలోనే గండిపడింది. జైలు అధికారుల కంటపడింది. దీంతో ఆ పావురాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న జైలు గార్డులు అవాక్కయ్యారు. చాలా పకడ్బందీగా ఓ మొబైల్ ఫోన్ ను, పెన్ డ్రైవ్ను కలిపి అవి వర్షానికి తడవకుండా నిరోధ్లో పెట్టి ప్యాక్ చేసి ఆ పావురం వీపునకు కట్టి పంపించిన తీరుతో ఖిన్నులయ్యారు.
పావురానికి అమర్చిన ఆ ప్యాకెట్ను స్మాల్ నెయిల్ కట్టర్ ద్వారా తొలగించి అనంతరం దానిని గాల్లోకి విడిచిపెట్టారు. పరిశీలిన కోసం మొబైల్ను, పెన్డ్రైవ్ను తీసుకెళ్లారు. దీని ప్రకారం జైలు నుంచి సెటిల్ మెంట్లు కూడా జరుగుతున్నాయని వారు కొత్తగా కనుగొన్నారు. ఈ పావురానికి వాటిని ఇచ్చి పంపించినవారికోసం దర్యాప్తు చేస్తున్నారు.