
చెక్కను చెక్కి.. వాచీగా మలచి...
టైమ్ చూసుకోవడానికి వాచీ వాడే రోజులు పోయాయి.. వాచీలో ఏదో కొత్తదనం ఉండాలి.. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోవాలి.. ఇదే ఇప్పుడు యువత ట్రెండ్. అలాంటి వారి కోసమే జపాన్‌కు చెందిన ‘టోక్యో ఫ్లాష్’ కంపెనీ ఈ ‘కిసాయ్ నైట్ విజన్ ఉడ్ వాచీ’ రూపొందించింది. ఏంటీ.. చెక్క వాచీనా?? అని తీసిపారేయకండి.. రెండో చిత్రం చూశాక దాని స్పెషాలిటీ ఏమిటో అర్థమైపోతుంది. దాదాపు అధిక భాగం చెక్కతో చెక్కిన ఈ చూడ చక్కని చేతి గడియారంలో అంతర్గతంగా ఎల్‌ఈడీ ఉంటుంది.
పక్కన బటన్ నొక్కగానే అది వెలుగుతుంది.. దీంతో వాచీ పై భాగంలో మనకు టైమ్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. రాత్రి పూటే కాదు.. పగలు కూడా! ఆ టైమ్ డిస్‌ప్లే కూడా కొంత వింతగానే ఉంటుంది. అర్థం చేసుకుంటే అలవాటైపోతుంది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా.. 150 డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.9000.