తలపాగాతో పరేడ్‌లో పాల్గొన్న చరణ్‌ప్రీత్ సింగ్ లాల్ (ఫైల్ ఫోటో)
లండన్ : పేరు ప్రఖ్యాతులు సాధించడం ఎంత కష్టమో వాటిని నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చరణ్‌ప్రీత్ సింగ్ లాల్(22). బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తలపాగా ధరించి మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న సైనికుడిగా రికార్డు సృష్టించిన చరణ్‌ప్రీత్ సింగ్ ఎంతో కాలం గడవకముందే ఆ పేరును పొగొట్టుకోవడమే కాకా ఉద్యోగాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు.
వివరాలు.. చరణ్‌ప్రీత్ సింగ్ బ్రిటన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రాణి ఎలిజబేత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొన్న ఏకైక సైనికుడిగా వార్తల్లో నిలిచాడు. ఇంత పేరు సాధించిన చరణ్‌ప్రీత్ సింగ్ గత వారం నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. చరణ్‌ప్రీత్ సింగ్ ఎక్కువ మోతాదులో కొకైన్ తీసుకున్నట్లు ఈ టెస్ట్‌లో తేలీంది. దాంతో త్వరలోనే అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం.
ఈ విషయం గురించి ఆర్మీ అధికారి ఒకరు ‘చరణ్‌ప్రీత్ సింగ్ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నామో.. ఇప్పుడు అతను చేసిన పని అంత ఇబ్బందికరంగా మారింది. సైనికులందరికి అప్పుడప్పుడు ఇలా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తుంటాం. ఈ సారి చరణ్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు సైనికులు కూడా మత్తు పదర్ధాలు తీసుకున్నట్లు తెలిసింద’ని తెలిపారు. పంజాబ్‌లో జన్మించిన చరణ్‌ప్రీత్ సింగ్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్‌కి వలస వెళ్లాడు. చదువు పూర్తయిన తరువాత 2016, జనవరిలో సైనికుడిగా బ్రిటీష్ ఆర్మీలో చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment