అలా చేయండి... ఐఫోన్ దక్కించుకోండి!
బీజింగ్: యుద్ధ సమయాల్లో దేశరక్షణకు కలిసి రావాలని యువతకు దేశాలు పిలుపు ఇవ్వడం సర్వసాధారణ విషయం. దేశం కోసం వీరత్వం అవసరం లేదు వీర్యం ఇవ్వండి చాలు అంటూ చైనా పిలుపు ఇచ్చింది. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. వీర్యం దానం చేయాలని 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులకు విజ్ఞప్తి చేసింది. వీర్య కణాల కొరత కారణంగా చైనాలోని స్పెర్మ్ బ్యాంకులు నిండుకున్నాయి.
రెండో సంతానం పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వీర్య కణాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో స్పెర్మ్ బ్యాంకులు ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి. దీంతో వీర్య దాతల కోసం విపరీతంగా వెదుకుతున్నారు. సోషల్ మీడియా ద్వారా యువకులకు వల వేస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని, రోజ్-గోల్డ్ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 'ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మడం అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మాల్సిన పనిలేదు. వీర్య దానంతో ఐఫోన్ కలను నెరవేరచ్చకోండి' అంటూ షాంఘై స్పెర్మ్ బ్యాంకు ఆన్లైన్ లో ప్రకటన ఉంచింది.
'వీర్యం దానం చేయండి, మీ దేశభక్తిని నిరూపించుకోండి' అంటూ స్పెర్మ్ బ్యాంకులు ప్రచారం చేస్తున్నాయి. దేశాన్ని వృద్ధాప్యం నుంచి బయటపడేసేందుకు వీర్యం దానం చేయాలని ప్రభుత్వ వార్తా సంస్థ కోరింది. సంబంధంలేని వ్యక్తుల వీర్యంతో పిల్లల్ని కనడం కన్ఫ్యూసియనిజం విలువలకు విరుద్ధమని కొంత మంది వాదిస్తున్నారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని.. వీర్యం, రక్తం దానం చేయడం ఒకటేనని బీజింగ్ స్పెర్మ్ బ్యాంకు కౌంటర్ ఇచ్చింది.