
కరాచీ, సదార్ సిటీల్లోని కొన్ని చైనీస్ డెంటల్ క్లినిక్స్
కొద్ది రోజులుగా కరాచీ సిటీలోని సదార్ లో గందరగోళ వాతావరణం నెలకొంది! 80కిపైగా చైనీస్ డెంటల్ క్లినిక్స్ లో అలసు చైనీస్ డాక్లర్లు కనిపించడంలేదు..
లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ నుంచి గుండుపిన్నుల వరకు వేలాది వస్తువుల్ని చీప్ రేట్ కే అందించడం చైనా బజార్ల ప్రత్యేకతని తెలిసిందే. వస్తు సేవలలాగే కొన్ని దేశాల్లో విస్తరించిన చైనీస్ వైద్య సేవలు కూడా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
పాకిస్థాన్ అరేబియా తీర నగరం కరాచీలోనూ చైనీస్ డెంటిస్టుల సేవలకు అమోఘమైన పేరుంది. కరాచీని ఆనుకుని ఉన్న సదార్ పట్టణంలోనైతే ఏకంగా ఏడెనిమిది వీధుల్లో చైనీస్ డెంటల్ హాస్పిటల్స్ కొలువుదీరి ఉంటాయి. చక్కటి పలువరుసతో కూడిన పెద్ద పెద్ద బొమ్మలు, వాటిపై 'ఇలాంటి పలువరుస మీకూ కావాలంటే వెంటనే లోనికి రండి' అనే ప్రకటనలు కనిపిస్తాయి.
అయితే కొద్ది రోజులుగా సదార్ లోని చైనీస్ క్లినిక్ ల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది! దంత వైద్యంతోపాటు నాలుగు చైనా పలుకులూ వినొచ్చనుకుని ఆ ఆసుపత్రులకు వెళ్లే రోగులు.. లోపల చైనీస్ డాక్టర్లు కనిపించకపోవడంతో కంగారు పడుతున్నారు. విషయం మీడియాకు తెలిసి ఆరా తీయగా.. సదార్ లోని 80కిపైగా చైనీస్ డెంటల్ క్లినిక్స్ లో అలసు చైనీస్ డాక్లర్లు లేనేలేరు!
కానీ, బయట బోర్డుల మీద మాత్రం డాక్టర్ హు, డాక్టర్ లీ, డాక్టర్ హాన్.. అనే పేర్లు యథావిథిగా కనిపిస్తున్నాయి. వాళ్లపేరుతో లోకల్ డాక్టర్లేమైనా మోసాలకు పాల్పడుతున్నారా అంటే అదీ లేదు. చైనీస్ డెంటిస్టుల మాదిరే తక్కువ డబ్బులు తీసుకునే పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇంతకీ చైనీస్ డాక్టర్లంతా ఏమైనట్లు? కరాచీ నగరవాసులు ప్రస్తుతం చర్చించుకుంటున్నది ఈ మిస్సింగ్ మిస్టరీ గురించే!
వైద్యం ద్వారా ఉపాధి వెతుక్కుంటూ 1940ల్లో పదుల సంఖ్యలో చైనీస్ దంతవైద్యులు కరాచీకి వచ్చారు. అప్పటికింకా దంతవైద్య సేవలు అందుబాటులోలేని కరాచీలో చైనీస్ డెంటిస్టులకు మంచి ఆదరణ లభించింది. నగరంతోపాటే వారూ విస్తరించారు. నూతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పంటివైద్యం కోసం జనం చైనీస్ క్లినిక్ లకే వెళ్తున్నారు. కారణం చైనీస్ వైద్యం తక్కకువ ధరకు అందుబాటులో ఉండటమని వేరే చెప్పనక్కర్లేదు. ఇక డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ విషయానికి వస్తే..
పాకిస్థాన్ లో సెటిలైన వేలాది మంది చైనీయుల్లో అత్యధికులు సొంతగడ్డకు తిరిగి వెళ్లిపోగా, అక్కడే ఉండిపోయిన మరి కొద్ది మంది తమ పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్నారు. తొలితరం చైనీస్ డెంటిస్టులకు అప్పట్లో లభించని ఎన్నెన్నో అవకాశాలు రెండో తరం వారికి అందుబాటులోకి రావడంతో వారు కూడా విదేశాల బాటపట్టారు. కరాచీ, సదార్ సిటీల్లోని క్లినిక్ లన్న చైనీస్ డెంటిస్టుల్లో చాలా మంది ప్రస్తుతం కెనడా, అమెరికా, ఇంగ్లాండ్ లకు వలస వెళ్లారు. పోతూపోతూ తమ క్లినిక్ లను స్థానిక డాక్టర్లకు అప్పగించి వెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్నది పాకిస్థానీ డాక్టర్లే అయినప్పటికీ క్లినిక్ లు నడిచేది మాత్రం చైనీస్ బ్రాండ్ ఇమేజ్ తోనే. మరి చైనా డాక్టర్లు ఏరి? అని పేషెంట్లెవరైనా ప్రశ్నిస్తే.. 'ప్రస్తుతం వారు ఫ్యామిలీస్ తో కలిసి టూర్ కు వెళ్లారు త్వరలోనే తిరిగిస్తారు' అని బదులిస్తున్నారు లోకల్ డాక్టర్లు!