నైస్ క్యాచ్.. చిన్నారి ప్రాణం కాపాడారు
బీజింగ్: చైనాలోని దక్షిణాది రాష్ట్రం గ్వాంగ్డాంగ్లో సినిమాను తలపించేలా ఓ నాటకీయ సన్నివేశం చోటు చేసుకుంది. వర్షం వచ్చే సూచన ఉండటంతో ఓ వ్యక్తి ఓ భవనం ముందు వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ భవంతిలోని పైఅంతస్తులో ఓ బాలుడు కిటికీలో వేలాడుతూ ప్రమాదకర పరిస్థితిలో కనిపించాడు. ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తమై మరొకరితో కలసి పడిపోతున్న బాలుణ్ని రక్షించేందుకు ప్రయత్నించాడు.
ఇద్దరు రెండు చేతులు చాచి బాలుణ్ని ఒడిసి పట్టుకున్నారు. దీంతో ఏడాది వయసున్న ఆ చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన గ్వాంగ్డాంగ్ టీవీ ప్రసారం చేసింది. ఈ సంఘటన ఆదివారం జరగగా.. ఫొటోలను శుక్రవారం విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నైస్ క్యాచ్ అంటూ నెటిజెన్లు కామెంట్ చేశారు. ప్రాణాలు రక్షించిన వ్యక్తిని హీరోగా అభివర్ణించారు.