ఎట్టకేలకు లొంగిపోయిన చోటు | Chotoo gang releases hostage policemen, surrenders to Army in Rajanpur | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు లొంగిపోయిన చోటు

Published Wed, Apr 20 2016 4:40 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

ఎట్టకేలకు లొంగిపోయిన చోటు

ఎట్టకేలకు లొంగిపోయిన చోటు

- 170 మంది అనుచరులు, భారీగా ఆయుధాలతో సైన్యానికి లొంగిపోయిన మాఫియా ముఠా నాయకుడు

రాజన్ పూర్: ఏక్షణం ఏం జరుగుతుందో అన్నట్లు 15 రోజులపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్లో కొందరిని చంపి, మరి కొందరిని బందీలుగా తీసుకుని ఏకంగా ఆర్మీకే సవాలు విసిరిన మాఫియా గ్యాంగ్ లీడర్ గులామ్ రసూల్ అలియాస్ చోటు తన 170 మంది సాయుధ అనుచరులతో బుధవారం ఎట్టకేలకు సైన్యానికి లొంగిపోయాడు. పంజాబ్(పాకిస్థాన్)లోని సింధూ నది నడిమధ్యన ఉన్నలంక గ్రామం (రాజన్ పూర్) ను చోటు గ్యాంగ్ రెండు వారాల కిందట స్వాధీనం చేసుకోవడం ఆ ప్రాంతం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత నియోజకవర్గం కావటంతో ఆర్మీ సాధ్యమైనంత మేరలో రక్తపాతాన్ని నివారించాలనుకుంది. ఆ క్రమంలో చోటు గ్యాంగ్ తో నిరంతరం చర్చలు జరిపే ప్రయత్నం చేసింది. ఒకానొకదశలో తనతోపాటు భార్యాపిల్లలు, కొందరు అనుచరులు దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లుచేయాలన్నచోటు డిమాండ్ కు సైన్యం అంగీకరించింది కూడా.

చివరికి చోటు లొంగుబాటుతో అతని గ్యాంగ్ నిర్బంధించిన 24 మంది పోలీసులు కూడా విముక్తులయ్యారు. దీంతో పోలీసుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. లొంగిపోయిన చోటూ గ్యాంగ్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొదట పోలీసులు, తర్వాత ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ పూర్తయినట్లు, చోటు గ్యాంగ్ లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులైతే ప్రకటించారుగానీ ఆర్మీ అధికారులు మాత్రం నోరుమెదపకపోవడం గమనార్హం. పోలీసుల ప్రకటన వెనకున్న మతలబును గమనిస్తే మరిన్ని విస్తుగొలిపే విషయాలు తెలుస్తాయి.

ఎవరీ చోటు?
సింధూ పరివాహక ప్రాంతమైన రాజన్ పూర్ లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గులామ్ రసూల్ అలియాస్ చోటు మొదట్లో ఓ ఆకతాయి కుర్రాడు. ఆ ప్రాంతంలో జరిగే దొంగతనాలు, మాఫియా ముఠాల సంచారం పోలీసులక చేరవేస్తూ జేబులు నింపుకునేవాడు. క్రమంగా అతడు పోలీసులకు కీలకమైన ఇన్ ఫార్మర్ గా మారాడు. పోలీసుల పనితీరు, నేరాలకు సంబంధించిన సమగ్రసచారంపై పట్టుచిక్కిన తర్వాత సొంతగా గ్యాంగ్ ను ఏర్పాటుచేసి దోపిడీలు మొదలుపెట్టాడు. కొల్లగొట్టిన సొమ్ములో కొంత రాజన్ పూర్ పరిసరగ్రామాల్లోని పేదలకు పంచిపెట్టేవాడు. (సైన్యానికి సవాళ్లు విసురుతూ సింధు నది లంకగ్రామంలో చోటుగ్యాంగ్ 15 రోజులు ఉండగలిగిందంటే ప్రజలు అతనికి ఎంతగా సహకరిస్తారో అర్థం చేసుకోవచ్చు)

కాలక్రమంలో చోటూ గ్యాంగ్ దోపిడీలతోపాటు అక్రమాయుధాల వ్యాపారంలోకి ప్రవేశించింది. పోలీసులకు కూడా తమ పాత కొరియర్ పై సాఫ్ట్ కార్నర్ ఉండేది. అయితే ఉగ్రవాదులు, మాఫియా గ్యాంగులపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పోలీసులు చోటుగ్యాంగ్ ను పట్టుకునేందు ఓ ఆపరేషన్ ప్రారంభించారు. లంక గ్రామంలోపలే చోటును బందీగా పట్టుకోవాలని అన్నివైపుల నుంచి దాడిచేశారు. కానీ చోటు దెబ్బముందు పోలీసుల ఎత్తులు చిత్తయ్యాయి. ఏడుగురు పోలీసులను చంపిన చోటుగ్యాంగ్ మరో 24 మందిని బందీలుగా పట్టుకుంది. ఇది జరిగిన 10 రోజుల తర్వాత ఆర్మీ రంగంలోకి దిగింది. చివరికి చోటు లొంగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement