వాషింగ్టన్: పదహారు రోజులుగా కొనసాగుతున్న అమెరికా ‘షట్‌డౌన్’ సుఖాంతమైంది. దివాలా పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రుణ పరిమితిని ఎత్తివేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయ సభలు చివరి నిమిషంలో ఆమోదించాయి. అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంటనే సంతకం చేయడంతో ‘కంటిన్యూయింగ్ అప్రోప్రియేషన్స్ యాక్ట్-2014’ చట్టంగా అమలులోకి వచ్చింది. సెనేట్‌లో 81-18, ప్రతినిధుల సభలో 285-144 ఓట్లతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అమెరికా ప్రస్తుత రుణ పరిమితి 16.7 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి రుణ పరిమితిని ఎత్తివేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందడంతో ప్రభుత్వోద్యోగులు గురువారం నుంచి తిరిగి విధుల్లోకి చేరారు.
దీని అమలు కాలం అక్టోబర్ 1 నుంచి మొదలైందని, 2014 ఫిబ్రవరి 7 వరకు రుణ పరిమితి పెంపు కొనసాగుతుందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జే కార్నే తెలిపారు. ప్రభుత్వ వ్యయంపై, ముఖ్యంగా ఒబామా హెల్త్‌కేర్ పథకంపై తలెత్తిన ప్రతిష్టంభన కారణంగా దేశవ్యాప్తంగా నేషనల్ పార్కులు, చారిత్రక ప్రదేశాలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ‘నాసా’, పర్యావరణ పరిరక్షణ సంస్థ వంటి జాతీయ సంస్థలు సైతం ‘షట్‌డౌన్’ ఫలితంగా 16 రోజులు మూతపడ్డాయి. ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందడంతో ఈ ప్రతిష్టంభనకు తెరపడింది. ‘షట్‌డౌన్’పై ఓటమిని రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోహ్నర్ అంగీకరించారు. తాము కడవరకు పోరాడామని, అయితే, గెలుపు సాధించలేకపోయామని అన్నారు. అమెరికా ‘షట్‌డౌన్’కు తెరపడటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
‘షట్‌డౌన్’ సుఖాంతం
Published Fri, Oct 18 2013 3:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement