చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా | Corona Cases Reach Ten Lakhs Around The World | Sakshi
Sakshi News home page

కరోనా పడగ

Published Fri, Apr 3 2020 1:05 AM | Last Updated on Fri, Apr 3 2020 12:48 PM

Corona Cases Reach Ten Lakhs Around The World - Sakshi

నిర్మానుష్యంగా వాషింగ్టన్‌లోని రహదారి

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50 వేలను మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి.

వాషింగ్టన్‌ /పారిస్‌/రోమ్‌
అగ్రరాజ్యానికి ఊపిరాడటం లేదు: అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే 2 లక్షల 36 వేలకు పైగా కేసులు నమోదైతే, మృతుల సంఖ్య 5,700 చేరుకుంది. న్యూయార్క్‌ రాష్ట్రంలో ఆరువారాల వయసున్న చిన్నారి మరణించడం అందరినీ కలచివేస్తోంది. అయినా సరే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాక్‌డౌన్‌ ప్రకటించడానికి అంగీకరించడం లేదు. ఒకవైపు భారీగా పెరిగిపోతున్న కేసులు, వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించలేకపోవడంతో అగ్రరాజ్యం ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుంది. (కరోనా: అపోహలూ... వాస్తవాలు)

మాస్క్‌లు, గ్లౌవ్స్, శానిటైజర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలకి కొరత ఉందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాల్లో ఈ స్థాయి ముప్పుని అగ్రరాజ్యం ఎప్పుడూ ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని అమలు చేసినప్పటికీ అమెరికాలో లక్ష నుంచి 2 లక్షల మంది వరకు మరణించవచ్చునని కరోనాపై పోరాటానికి వైట్‌హౌస్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ అంచనా వేస్తోంది. అయితే ప్రజలు ఇంటిపట్టునే ఉండేలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చర్యలు తీసుకుంది. 33 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో గత నెల రోజులుగా 27 కోట్ల మంది ఇంటిపట్టునే ఉంటున్నారు. విద్యాసంస్థలన్నీ మూసివేశారు. రవాణా, పర్యాటక రంగాలు స్తంభించాయి. (కరోనా: భయంకర వాస్తవం!)

భారత్‌లో ఉన్న అమెరికన్లు వెనక్కి: కరోనా ముప్పుతో వివిధ దేశాలు అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసివేయడంతో దాదాపుగా 30 వేల మందికి పైగా అమెరికా పౌరులు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వారిని వెనక్కి రప్పించడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లో ఉన్న అమెరికన్లు తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్‌ లాక్‌డౌన్‌ సమయంలో అక్కడే ఉండిపోయిన ఈ తరుణంలో భారత ప్రభుత్వం తమకు చాలా సాయం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ వారాంతం నుంచి న్యూఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి అమెరికన్లను వెనక్కి తెస్తామని తెలిపింది.

ఆరోగ్య సదుపాయాలు పటిష్టంగా ఉండే స్పెయిన్‌లో ఒక్కరోజే 950 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య పదివేలు దాటి పోయింది. ఇక కేసుల విషయానికి వస్తే లక్షా 10 వేలు దాటిపోయాయి. అయితే గత వారంతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.  

బ్రిటన్, ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య ఎక్కువవుతూ ఉంటే, ఇటలీలో కేసులు, మృతుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. 

తమ దేశంలో ఒక్క కరోనా వైరస్‌ కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా ప్రకటించింది. చైనాలో కొత్త వ్యాధి బయటకు వచ్చిందని తెలియగానే జనవరిలోనే తాము సరిహద్దులన్నింటినీ మూసేశామని, అందుకే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు 

కరోనా వైరస్‌ కారణంగా కేవలం వృద్ధులే ప్రాణాలు కోల్పోతారన్నది వాస్తవం కాదని, యువకుల్లో రోగనిరోధక శక్తి లేని వారు కూడా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

దేశం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది : ట్రంప్‌ 
కరోనాపై అన్ని వైపుల నుంచి యుద్ధం చేస్తున్నామని, ఎలాగైనా వైరస్‌పై విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనదని పెరిగిపోతున్న కేసుల సంఖ్య చూస్తే తెలుస్తుందన్నారు. ‘‘వైరస్‌పై పోరాటంలో భాగంగా ఎన్నో చర్యలు తీసుకున్నాం. భౌతిక దూరం, పనిచేసేవారికి ఆర్థిక సాయం, వైద్య సదుపాయాలు, విదేశీ ప్రయాణాలు రద్దు, కరోనాకు మందులు, వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలు చేపట్టడం వంటివన్నీ ఎన్నో చేశాం. మరే దేశానికంటే ముందే ఈ చర్యలన్నీ తీసుకున్నాం’’అని ట్రంప్‌ మీడియాతో పేర్కొన్నారు. ‘‘రాబోయే రోజుల్లో దేశం చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది. రెండు మూడు వారాలు చాలా సంక్లిష్టమైన కాలం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సమయంలో అమెరికన్లు ఎప్పుడూ కుంగిపోరు. భయపడిపోరు. కలసికట్టుగా ఎదుర్కొంటారు’ అని అన్నారు.

గత ఐదు రోజుల్లో ఆయా దేశాల్లో కరోనా కేసులు, మృతులు ఇలా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement