అమెరికాలోని శాక్రామెంటో సిటీలో లాక్‌డౌన్ వేళ తన తల్లి ఉద్యోగమూ అత్యవసరమేనని ప్లకార్డు ప్రదర్శిస్తున్న ఓ చిన్నారి
బీజింగ్/వాషింగ్టన్: కరోనా వైరస్ నిరోధానికి చైనా అభివృద్ధి చేస్తున్న టీకా ఈ ఏడాది ఆఖరుకల్లా అందుబాటులోకి రానుందా? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఈ టీకాను ఏడాది చివరిలోగా కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులకు అందించాలని చైనా యోచిస్తోంది. సాధారణ పద్ధతుల్లో తయారు చేస్తే ఈ ఏడాది చివరికి టీకా అందుబాటులోకి రాదని, అయితే ఈ మధ్యలో పరిస్థితి విషమిస్తే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి దీన్ని వాడతామని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ గావ్ ఫూ అంటున్నారు. వ్యాధి ఏ రకంగా విస్తరిస్తుందన్న అంశం ఆధారంగా కొంతమంది వైద్యసిబ్బందికి ఈ టీకాను ఇస్తామని గావ్ వివరించారు. అందరి సహకారంతో టీకాను అభివృద్ధి చేయగలమనే నమ్ముతున్నామని.. ఆయన గ్లోబల్ టైమ్స్ పత్రికతో చెప్పారు. చైనా అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ఓ అడినోవైరస్ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది. మార్చి నెలాఖరుకు తొలిదశ ప్రయోగాలు పూర్తి కాగా, ఏప్రిల్ 12న రెండో దశ ప్రయోగాలు మొదలయ్యాయి.
ఊపందుకున్న ప్రయోగాలు
అమెరికాలో వైరస్‌ను మట్టుబెట్టేందుకు ఉన్న అన్ని ఉపాయాలను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. వైరస్‌పై దాడి చేసి నాశనం చేయడం, దాని ఉత్పత్తి వేగాన్ని తగ్గించడం, ఒకరి నుంచి ఇంకొకరికి సోకడాన్ని తగ్గించడం, రోగ నిరోధక శక్తి పెంచడం వంటి అనేక మార్గాల్లో ఒక్క అమెరికాలోనే సుమారు 72 వరకూ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇవి మాత్రమే కాకుండా మరో 211 ప్రయత్నాలు ప్రణాళిక దశలో ఉన్నాయని చెప్పారు. చికిత్సతోపాటు, టీకా తయారీ కోసమూ జరుగుతున్న ఈ ప్రయత్నాలన్నీ మంచి పురోగతి సాధించినట్లు ఆయన చెప్పారు.
చైనా అక్రమంగా నిల్వ చేస్తోంది!
కరోనా వైరస్ కట్టడిలో కీలకమైన వ్యక్తిగత రక్షణ కిట్లు, మాస్కులను చైనా అక్రమంగా నిల్వ చేసుకుని ఇప్పుడు అధిక ధరలకు అమ్ముతోంది అనేందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని వైట్‌హౌస్ అధికారి ఒకరు ప్రకటించారు. కరోనా వైరస్ గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో గుర్తించగా చైనా జనవరి, ఫిబ్రవరిలో 18 రెట్లు ఎక్కువ మోతాదులో మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొనుగోలు చేసిందని ట్రేడ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ డైరెక్టర్ పీటర్ నవారో సోమవారం ఆరోపించారు. ఒకవైపు భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో తగినన్ని కిట్లు లేకపోగా చైనా మాత్రం వాటిని అక్రమంగా నిల్వ చేసిందని ఆరోపించారు. ఈ రకమైన అంశాలపై విచారణ జరిగి తీరాలని, అంతర్జాతీయ స్థాయిలో ఓ విపత్తు వచ్చినప్పుడు చైనా ఈ రకంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదన్నారు.
25 లక్షల కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. దీని బారిన పడిన వారి సంఖ్య మంగళవారం 25 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 1.75 లక్షలు దాటింది. మరణించినవారిలో యూరోపియన్ దేశాలకు చెందిన వారు ఒక లక్ష ఆరు వేల మంది ఉండగా.. అత్యధిక మరణాల రేటు నమోదవుతున్న అమెరికాలో 42వేలు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment