
సాక్షి, అమరావతి: శరీరంలో కోవిడ్ వైరస్ తీవ్రతను బట్టే రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు వాడతారు. కానీ చాలామంది సాధారణ లక్షణాలున్నా ఆస్పత్రులకు వెళ్లి రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు కావాలని అడుగుతున్నారు. కోవిడ్ సోకి, సాధారణ లక్షణాలుండి, తక్కువ తీవ్రత ఉంటే మందులతోనే నయం అవుతుందని, రోగి చేయాల్సిందల్లా ఇతరులకు సోకకుండా ఇంట్లోనే ఉండటమేనని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మంది రెమ్‌డెసివర్ గురించి తెలియక ఆస్పత్రికి వెళ్లి రెమ్‌డెసివర్ అడుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
సీటీ సివియారిటీ స్కోర్ ఎక్కువగా ఉంటేనే
ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్ తీశాక.. ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం ఉండి, ఆయాసం ఎక్కువగా ఉంటేనే ఈ ఇంజక్షన్లు వాడాలి. వాస్తవానికి సీటీ సివియారిటీ స్కోర్ 25గా భావిస్తారు. ఇందులో 15 కంటే స్కోరు మించి, ఆయాసం ఉంటేనే ఇంజక్షను ఇవ్వాలి. 8 వరకూ నామమాత్రపు ప్రభావం. 8 నుంచి 14 వరకూ ఉంటే ఓ మోస్తరు తీవ్రతగా నిర్ధారిస్తారు. ఇవేవీ పట్టించుకోకుండా సీటీ స్కోరు 6 ఉన్నా కూడా రెమ్‌డెసివర్ కావాలని అడుగుతున్నారు. కొన్ని చోట్ల డాక్టర్లు కూడా రిస్కు ఎందుకులే అనుకుంటూ ముందే ఇంజక్షన్లు వేస్తున్నారు. ఇలా వేయడం మంచిది కాదని, సీటీ స్కాన్‌లో తీవ్రత, ఆయాసం ఉంటేనే వేయాలని తిరుపతికి చెందిన అనస్థీషియా వైద్యులు డా.కిషోర్ తెలిపారు.