సింగపూర్ : చైనాను కబలిస్తూ ప్రపంచ దేశాలను వణిస్తున్న కరోనా వైరస్‌తో సింగపూర్‌లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. అక్కడ ఇప్పటికే 33 కరోనా కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం శుక్రవారం ‘ఆరెంజ్’ హెచ్చరికను జారీ చేసింది. దాంతో నగరంలోని మార్కెట్లన్నీ అమ్మకాలతో కిటకిటలాడాయి. మొహానికి మాస్కులు ధరించిన వేలాది మంది నిత్యావసరాలు కొనేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరారు. విపరీతమైన కొనుగోళ్ల నేపథ్యంలో.. మార్కెట్లన్నీ జనంతో నిండిపోయాయి. అన్ని సూపర్ మార్కెట్లు, నిత్యవసర సరుకుల దుకాణాలు ఖాళీ అయ్యాయి. శుక్రవారం మొదలైన కొనగోళ్ల తాకిడి శనివారం కూడా కొనసాగుతోంది.
(చదవండి : ‘కరోనా వైరస్’ కేసులు ఇంకా ఎక్కువే!)
2003లో 26 దేశాలను వణికించిన ‘సార్స్’ ఉపద్రవం మాదిరిగానే కరోనా కూడా ప్రబలే అవకాశం ఉందన్న ప్రభుత్వ హెచ్చరికలతో.. మార్కెట్లకు పరుగులు పెట్టామని ప్రజలు చెప్తున్నారు. ‘కరోనా మా దేశంలో మరింత విజృంభిస్తే హెల్త్ ఎమర్జెన్సీలో భాగంగా ‘రెడ్’ అలర్ట్ జారీ చేస్తారు. అప్పడు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆకలితో చావాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా బియ్యం, నూడుల్స్ వంటి నిత్యావసరాలు కొనగోలు చేస్తున్నాం’అని ఓ మహిళ పేర్కొన్నారు.
(చదవండి : కరోనా కల్లోలం)
అయితే, ప్రజలెవరూ గాబరా పడాల్సింది లేదని, సింగపూర్‌లో కరోనా ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వాణిజ్యశాఖ మంత్రి చాన్ చున్‌సింగ్ స్పష్టం చేశారు. ఆహార సంబంధ సరుకులన్నీ సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. కాగా, చైనాలోని హంగ్‌కాంగ్‌లో కూడా కరోనా నేపథ్యంలో అమ్మకాలు భారీగా పెరిగాయి. చైనాలో గత ఏడాది చివరి దశలో మొదలైన కరోనా విజృంభణతో ఇప్పటి వరకు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 34 వేల మంది వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment