బ్రస్సెల్స్ : చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఐరోపా మేధావులు స్పష్టం చేశారు. సీపీఈసీ కారిడార్ అనేది గిల్గిత్-బలిస్తాన్ ప్రాంత ప్రజల హక్కులను కాలరాయడమేనని మేధావులు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని వారు స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వివాదాస్పద ప్రాంతంలో ఇరు దేశాలు ఇంత భారీ నిర్మాణాలను చేపట్టడం అనేది అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనని హేగ్ సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ నిపుణులు విలియన్ వోస్టర్‌వెల్డ్ స్పష్టం చేశారు. ఆక్రమిత కశ్మీర్‌ను ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదాస్పద ప్రాంతంతో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ఐరోపాలోని మేధావులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, దౌత్యాధికారులు ఇతర మేధావులంతా.. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే చైనా నిర్మిస్తున్న ఒర్ బెల్ట్ ఒన్ రోడ్ కూడా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల వాణిజ్యాన్ని ఆక్రమించేలా ఉందని జర్మనీకి చెందిన క్లుడియా వాడ్‌లిచ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. సీపీఈసీ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతమేరకు మేలు చేస్తుందో చెప్పలేం.. కానీ ఉగ్రవాదులకు మాత్రం అద్భుతంగా సహాపడుతుందని సౌత్ ఏషియా డెమోక్రటిక్ ఫోర్ అధ్యక్షుడు డాక్టర్ సెగ్రిఫెడ్ ఊల్ఫ్ పేర్కొన్నారు.
భారత్, ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతిస్తోందని ఆయన తెలిపారు. గిల్గిత్, బలిస్తాన్ ప్రాంతంలోని ప్రజలను ఈ ప్రాజెక్టు కోసం పాకిస్తాన్ ఆర్మీ బలవంతంగా ఖాళీ చేయిస్తోందని ఆయన అన్నారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment