మౌంట్ షార్ప్ పర్వతపాదం చేరుకున్న క్యూరియాసిటీ
వాషింగ్టన్: అంగారకుడిపై గేల్‌క్రేటర్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం దిగిన క్యూరియాసిటీ శోధక నౌక ఎట్టకేలకు తన తుది గమ్యానికి చేరువైంది. గేల్‌క్రేటర్ మధ్యలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్‌షార్ప్ పర్వతం వద్దకు క్యూరియాసిటీ చేరుకుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది.
భౌగోళికంగా ప్రత్యేకమైన పర్వత పాదం వద్ద కొంత అన్వేషణ తర్వాత రోవర్ ఐదున్నర కిలోమీటర్ల ఎత్తైన పర్వతం పైకి చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గేల్‌క్రేటర్‌లో 2012 ఆగస్టులో దిగిన క్యూరియాసిటీ తన రెండేళ్ల ప్రయాణంలో మార్స్‌పై ఒకప్పటి నీటి ప్రవాహ జాడలను కనుగొనడంతో పాటు అక్కడి శిలలు, మట్టిని విశ్లేషించి ఖనిజలవణాల సమాచారాన్ని, అనేక ఫొటోలను భూమికి పంపిన సంగతి తెలిసిందే.