నిద్ర బాగా పట్టాలంటే..
ఎండలు మండిపోతున్నాయి.. రాత్రి పూట కూడా ఏమాత్రం చల్లగా ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివాళ్ల కోసం శాస్త్రవేత్తలు సరికొత్త పరిష్కారాలు చూపిస్తున్నారు. డార్క్ చాక్లెట్ తింటే.. బాగా నిద్రపడుతుందని సరికొత్త పరిశోధలలో వెల్లడైంది. ఇందులో మెగ్నీషియం బాగా ఉంటుందని, దానివల్ల బాడీక్లాక్ సరైన సమయానికి సరిగ్గా తిరుగుతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల మీకు రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే పడుకునే ముందు డార్క్ చాక్లెట్ తినాలని సూచిస్తున్నారు.
అయితే, మెగ్నీషియం కేవలం డార్క్ చాక్లెట్‌లోనే కాదు.. మంచి తాజా ఆకు కూరలు, పప్పులు, విత్తనాలు, చేపలు, బీన్స్, తృణధాన్యాలు, అవకాడోలు, పెరుగు, అరటిపళ్లు, ఎండుచేపలలో కూడా బాగుంటుందని అంటున్నారు. శరీరంలో మెగ్నీషియం తగినంతగా ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కొన్నిరకాల కేన్సర్లను అరికట్టొచ్చని, గుండెపోటు వచ్చే ముప్పును కూడా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు.
శరీరంలోని కణాలు పగలు, రాత్రి సహజ వాతావరణానికి అలవాటు పడి, సమయానికి తగినట్లుగా స్పందించడానికి కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుందని ఎడిన్‌బర్గ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలలో జరిగిన పరిశోధనలలో వెల్లడైంది. శరీరంలో మెగ్నీషియం స్థాయి పెంచుకోడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నా.. ఆహారం ద్వారా వస్తేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.