‘మనలో చాలా మందికి తెల్లగా ఉంటేనే అందం అని మైండ్‌లో ఫిక్సయి ఉంటుంది. కానీ నలుపు అందానికి నేనే అసలు సిసలు ఉదాహరణ’ అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంటుంది ఈ సౌందర్యరాశి.
ప్రపంచం అంతటా తెలుపు– నలుపు వర్ణం గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. తెల్లగా ఉన్నవారికే అన్నింటా అవకాశాలు అనేవారూ ఉన్నారు. కాస్త రంగు తక్కువైనా ‘నేను అందంగా లేను’ అని బాధపడే అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. ఫెయిర్‌గా కనిపించడానికి రకరకాల సౌందర్య చికిత్సలు తీసుకునేవారి శాతమే ఎక్కువ. కానీ, సుడానీస్ సంతతికిS చెందిన అమెరికన్ ఆఫ్రికన్ మోడల్ ‘న్యాకిమ్ గాట్వేచ్’కు నల్లగా ఉన్నందువల్లే అందగత్తెను అనిపించుకోవడం ఇష్టం. నల్లగా ఉండటం వల్లే అభిమానులు గాట్వెచ్‌ను మురిపెంగా ‘చీకటి రాణి’ అని పిలుస్తుంటారు. రోజు రోజుకు పెరుగుతున్న అభిమానుల సంఖ్యతో ఆమె తన డార్క్ స్కిన్ టోన్‌ను చూసుకొని మరింతగా గర్వపడుతుంటుంది. ‘నిన్ను ఎవరైనా నల్లగా ఉన్నావంటే ఏ మాత్రం సిగ్గు పడవద్దు’ అని మరీ కఠువుగా చెబుతుంది గాట్వెచ్.
డార్క్ చాక్లెట్
జీవితంలో చీకట్లను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. కాని చీకటితో పోటీ పడుతుందని నలుపురంగు మేనిని చూసుకొని భయపడకండని చెబుతున్న ఈ ఆఫ్రికన్ అమెరికన్ మోడల్‌ను కలుసుకుంటే నలుపు మీద ఏళ్లుగా మనలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా మోడలింగ్ రంగంలో సాంప్రదాయక తెలుపు రంగు మేని ఉంటేనే రాణిస్తారు. కానీ, గాట్వెచ్ ఆ అడ్డంకులను అడ్డంగా కూలదోస్తోంది. మిన్నెసోటాలో నివసిస్తున్న ఈ పాతికేళ్ల అమెరికన్ ఆఫ్రికన్ ఫ్యాషన్ పరిశ్రమంలో వైవిధ్యం కోరుకునే స్త్రీ గానే కాదు న్యాయవాదిగా ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయుల హక్కుల కోసం నినదించే ఒక గొంతుక కూడా.
బ్లీచ్ చేయించుకోమని సలహా..!
నల్లగా ఉన్నవారి చర్మాన్ని తెలుపుగా మార్చుకోమని చెప్పేవారి సౌందర్య సలహాలకు కొదవే ఉండదు. అంటూ తనకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది గాట్వెచ్. ‘అందంగా కనిపించడానికి అందగత్తెనే కానవసరం లేదు. నలుపు అనేది ఓ ధైర్యం. నలుపు బంగారం. నలుపు అందం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను రకరకాల క్యాప్షన్లతో పోస్ట్ చేస్తుంది గాట్వెచ్. ‘అభిమానులు నా ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చే యడం నాకు అమితమైన ఆనందాన్నిచ్చింది. రెండేళ్ల కిందట నేను నిరుద్యోగిని. నా స్నేహితుల్లో కొంతమందితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసేదాన్ని.
ఆ సమయంలోనే ఓ ఇంటర్వూ్యకి వెళ్లాల్సి వచ్చింది. క్యాబ్ బుక్ చేసుకున్నాను. నన్ను చూసిన ఆ క్యాబ్ డ్రైవర్ హావభావాలు నన్ను అమితమైన ఆశ్చర్యానికి లోను చేశాయి. నేను క్యాబ్ దిగేముందు ‘మీరు బ్లీచ్ చేయించుకుంటే పదివేల డాలర్లు ఇస్తాను’ అని చెప్పాడు. ఎందుకు నేను బ్లీచ్ చేయించుకోవాలి? అని ఎదురు ప్రశ్నించాను. ‘మీ రంగును చూసి నేనే భయపడ్డాను. ఉద్యోగానికి వెళుతున్నారు. ఇలా ఉంటే మిమ్మల్ని ఎవరూ జాబ్‌లోకి తీసుకోరు’ అన్నాడు. ‘నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఉద్యోగం ఇచ్చేవారు నా అర్హతను చూడాలి. రంగు కాదు. అందం కోసం మీరు చెప్పిన పనులు ఎప్పుడూ చేయను’ అంటూ దిగిపోయాను..’ అంటూ తెలిపింది గాట్వెచ్. గ్లామర్ ప్రపంచమైన ఫ్యాషన్, మోడల్ రంగాల్లో నలుపు ప్రత్యేకతను చాటుతున్న గాట్వెచ్ ఈ తరానికి అసలు సిసలైన ప్రతినిధి.
Comments
Please login to add a commentAdd a comment