పాలపుంత సైజులో కొత్త గెలాక్సీ!
వాషింగ్టన్: మన పాలపుంత పరిమాణంలో ఉన్న భారీ గెలాక్సీ (నక్షత్ర సమూహం)ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గెలాక్సీ మొత్తం కృష్ణపదార్థంతో తయారైందని భావిస్తున్నారు. డ్రాగన్ ఫ్లై-44 అని పిలుస్తున్న ఈ గెలాక్సీ ‘కోమా’ నక్షత్ర సమూహానికి దగ్గరగా ఉంది. ఇందులో అక్కడక్కడ కొన్ని నక్షత్రాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు హవాయిలోని డబ్ల్యూఎం కెక్ నక్షత్ర శాల, జెమినీ నార్త్ టెలీస్కోప్‌ల సాయంతో గుర్తించారు.
దాదాపు 6 రాత్రుల పాటు పరిశీలించి డ్రాగన్ ఫ్లై-44లోని నక్షత్రాల వేగాన్ని (వెలాసిటీ) కొలిచారు. ఈ గెలాక్సీ మధ్య భాగం చుట్టూ ఉన్న గోళాకార నక్షత్రాల సమూహపు వెలుతురు భాగం.. మన పాలపుంత చుట్టూ ఉన్న వెలుతురు భాగం మాదిరిగానే ఉన్నట్లు గుర్తించారు. నక్షత్రాల వేగం గెలాక్సీ పదార్థాన్ని సూచిస్తుందని, నక్షత్రాలు ఎక్కువ వేగంగా కదిలితే గెలాక్సీ పదార్థం కూడా అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.