చనిపోయిన తల్లికి పుట్టిన మృత్యుంజయురాలు
చనిపోయిన తల్లికి పుట్టిన మృత్యుంజయురాలు
Published Mon, Jul 28 2014 5:16 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
ఆకాశం నుంచి పడిన ఓ ఇజ్రాయిలీ బాంబు తల్లిని కడతేర్చింది. మరి కొన్ని బాంబులు ఆమె ఇంటిని తునాతునకలు చేశాయి. ధ్వంసమైన ఇంటి భగ్నశకలాల మధ్య పడున్న ఆ తల్లి కడుపులో ఓ బిడ్డ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. బలహీనంగానైనా ఊపిరి తీసుకుంటూ 'బతుకుతాను' అంటోంది.
ఇజ్రాయిల్ పాలెస్తీనియన్ల భీకర పోరులో, బాంబుల వర్షం, బారు ఫిరంగుల మోతలో శవమైన తల్లి కడుపులో ఉన్న ఆ బిడ్డను బయటకు తీసేందుకు డాక్టర్లు గడియారం ముల్లుతో పోటీ పడుతూ ప్రయత్నించారు. మామూలుగా తల్లి చనిపోయిన అయిదు నిమిషాలకే కడుపులో బిడ్డ కూడా చనిపోతుంది. కానీ షర్నా అనే 23 ఏళ్ల ఆ తల్లి గాజా లోని డేర్ అల్ బలాహ్ ఆస్పత్రికి రావడానికి ముందే చనిపోయింది. అప్పటికే పదినిముషాలైంది. అయినా డాక్టర్లు ఆశ వదల్లేదు. సిజేరియన్ చేసి మరీ పాపను బయటకి తీశారు. పాప ఊపిరి తీసుకుంటోంది. గుండె బలహీనంగానైనా కొట్టుకుంటోంది.
"నిజంగా ఇదొక అద్భుతం. ఇప్పటికీ ఆ పాప బతుకుతుందా అన్నది చెప్పలేం. ఛాన్సులు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి" అన్నారు ఆమెను బయటకు తీసిన డాక్టర్ ఫాదీ అల్ ఖ్రోటే. "ఆ పాప బతుకుతుందనే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ పాప పాలెస్తీనియన్. పాలెస్తీనియన్లది నిత్యం బతుకు పోరాటమే" అన్నారాయన.
చావు మధ్య చావు నుంచి పుట్టిన ఆ పాప చిరంజీవి కాకపోతే ఇంకెవరు చిరంజీవి అవుతారు?
Advertisement