శవాలను వెలికితీసి..వాటిని శుభ్రపరిచి | death festivals all over the world | Sakshi
Sakshi News home page

శవాలను వెలికితీసి..వాటిని శుభ్రపరిచి

Published Fri, Jan 22 2016 11:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

శవాలను వెలికితీసి..వాటిని శుభ్రపరిచి

శవాలను వెలికితీసి..వాటిని శుభ్రపరిచి

పండుగలు, ఉత్సవాలు, జాతరలు, పర్వదినాల్లో అనేక రకాలున్నాయి. చాలా వరకు పండగలన్నీ మతంతో ముడిపడి ఉన్నప్పటికీ.. వీటిలో కొన్ని మానవుని ఉత్పత్తితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానోగాని సంబంధం కలిగి ఉంటాయి. ఉత్పత్తి అంటే ఆహార ఉత్పత్తి మాత్రమే కాదు. పునరుత్పత్తి కూడా! పంటలు, రుతువులను బట్టి కూడా పండుగలు జరుపుకుంటారు. కొన్ని పూర్తిగా ఆధ్యాత్మిక పండుగలున్నాయి. ఇటీవల కాలంలో రాజకీయ విముక్తి, ఉద్యమాలు, పోరాటాల్లో త్యాగాలు చేసిన వారి జయంతులు, వర్ధంతులు కూడా పండగలు,పర్వదినాల్లో చేరిపోయాయి. ఒక మర్యాదగానో లేక భయం కారణంగానో మరణించినవారిని గౌరవించాలని నమ్మకం  ప్రపంచంలోని అన్ని సమాజాలు, నాగరికతల్లో  ఉంది. కొన్ని నాగరికతల్లో అయితే మరణించిన వారిని గుర్తించుకొనుటకు ప్రత్యేకంగా సెలవు దినాలుగా కేటాయించుకున్నారు. మరణించిన వారిని స్మరించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చేసుకునే కొన్ని పండుగలు గురించి తెలుసుకుందాం.

 డే ఆఫ్ డెడ్..
మెక్సికోలో జరుపుకునే పండుగ ఇది. ఆ దేశంలో అతి ముఖ్యమైన పండుగగా జరుపకుంటారు. ప్రతి ఏడాది నవంబర్ 1, 2 తేదీల్లో  ఘనంగా జరుపుకుంటారు. ప్రతి చోటును పుర్రెలు, ఎముకలతో అందంగా అలంకరిస్తారు. పండుగ రోజున పూర్వీకుల  సమాధులను శుభ్రపరుస్తారు. వాటిని పూలతో అందంగా అలంకరిస్తారు. వారి సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహిస్తారు.
 

బాన్ ఫెస్టివల్..
జపాన్‌లో గత 500 సంవత్సరాల నుంచి తమ పూర్వీకుల జ్ఞాపకార్థం ఈ వేడుకను జరుపుకుంటున్నారు. బౌద్ధమత సంబంధమైన ఈ వేడుకను మూడు రోజులు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆగస్టు 15-18 మధ్య దీనిని జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ముఖ్యమైంది బాన్ ఓడోరి అనే నృత్యం. ఈ నృత్యం చేస్తే వారివారి పూర్వీకుల ఆత్మలు దిగివచ్చి వారితో పాటు వేడుకలో పాల్గొంటాయనేది వారి నమ్మకం. ఒక బౌద్ధమతస్థుడు ధ్యానం చేస్తున్నప్పుడు తన తల్లి ఆత్మ...కొన్ని ప్రేతాత్మల మధ్య ఇరుక్కుని కష్టపడుతుందని తెలుసుకుంటాడు. ఎలాగైనా తన తల్లి ఆత్మను కాపాడమని బుద్ధుని కోరగా..ఆయన మత గురువుల కోసం శ్రద్ధాంజలి జరపుకోమని చెప్పారట. ఆయన చెప్పినట్టే చేసిన అతనికి తన తల్లిని దయ్యాలు వదిలేసినట్లు కనపడటంతో ఆనందంతో నృత్యం చేసేడట. ఆ నృత్యమే ‘బాన్ ఓడోరి’ అనే నృత్యంగా ప్రసిద్ధి చెందింది.

 

ద హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్..
చైనాలో జరుపుకునే పండుగ ఇది. నెల రోజలు నిర్వహిస్తారు. ఆ నెలను ఆత్మల నెలగా పిలుస్తారు. ఆ నెలలో ఒక రోజు వారి పూర్వీకులు వారి ఇంటికి వచ్చి భోజనం చేస్తారని వారు నమ్ముతారు. నెలలో ఏ రోజు వస్తారో తెలియదు కనక ఆ నెల మొత్తం వారు భోజనం చేసేటప్పుడు అధికంగా ఒక పల్లెంలో ఆహారం ఉంచి పెడతారు. అలాగే రోజూ రాత్రిపూట వెదురు పేపరుతో చేసిన ఆకులలో చిన్న కొవ్వొత్తులను వెలిగించి చెరువులలో వదులుతారు.

 

 

కింగ్‌మింగ్ ఫెస్టివల్..
చైనీయులు ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం మధ్యలో జరుపుకుంటారు. పండుగ రోజు తమ పూర్వీకుల సమాధుల దగ్గరకు వెళ్లి సమాధులను శుభ్రం చేస్తారు. సమాధుల వద్ద టీ, భోజనం, వెదురుతో చేసిన పేపరును ప్రసాదంగా ఉంచుతారు. ఈ మూడు సమాధుల వద్ద ఉంచితే ఆత్మలకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం.

 

 

చుసియోక్..
దక్షిణ కొరియాలో జరుపుకునే ఈ పండుగకు ఆ దేశంలో మూడు రోజుల సెలవు. తమ పూర్వీకుల పుణ్యం, దయ, కటాక్షం కారణం కారణంగానే తాము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని ప్రజలు వారిని పండుగ రోజుల్లో స్మరించుకుంటారు. మొదటి రోజు ‘సాంగ్‌పియోంన్’ అనే భోజనం తయారుచేసి మొత్తం పూర్వీకులకు సమర్పిస్తారు. మిగిలిన రెండు రోజులు పూర్వీకుల సమాధుల దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ నృత్యాలు చేస్తారు.

 

 

గాయ్‌జాతర..:
నేపాల్‌లో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ పండుగను 8 రోజులపాటు జరుపుకుంటారు. ఆవులు తమ ఆత్మీయుల ఆత్మలను స్వర్గానికి తీసుకువెళతాయని వారు నమ్ముతారు. అందుకుని ఆ సంవత్సరం వారి కుటుంబాల్లో చనిపోయిన వారికోసం ఆవులను ఊరేగింపుగా ఆ ఇంటి పెద్ద తీసుకువెళతాడు. ఆవులు దొరకని వారు వారి ఇళ్లలోని పిల్లలను అలంకరించి తీసుకువెళతారు. మరణానికి సంబంధించిన  పాటలు పాడుకుంటారు. దీని వల్ల  మరణ భయం పోతుందని వారి నమ్మకం.

 

లిమురాలియ..
ఇది మిగిలిన దేశాలలో చేసుకున్నట్లు పూర్వీకుల ఆత్మశాంతికోసం చేసే పండుగ కాదు.  రోమ్ నగరంలో పూర్వీకుల ఆత్మలను తమ ఇళ్ల నుంచి తరిమివేయటానికి, ఇంటిని పరిశుద్ధంగా చేసుకోవటానికి ఈ పండుగను చేసుకుంటారు. ఆ ఇంటి పెద్ద మధ్య రాత్రి లేచి, మూడు సార్లు చేతులు కడుగుకొని, కాళ్లకు చెప్పులు లేకుండా తన భుజాలపై నుంచి నల్ల నువ్వులను 9 సార్లు ఇళ్లంతా జల్లుతూ..‘నన్నూ, నా వారినీ ఈ నల్ల నువ్వులతో ఆత్మల దగ్గర నుంచి విడిపిస్తున్నాను’ అని చెబుతాడు.

 

 

పితృ పక్ష
హిందూ సంప్రదాయం ప్రకారం ఆశ్వయూజ మాసంలో 15 రోజులు జరుపుకుంటారు. తమ పితృ దేవతలకు ప్రార్థన చేస్తూ భోజనమును ప్రసాదంగా పెడతారు. హిందూ పురాణాల ప్రకారం కర్ణుని ఆత్మ స్వర్గం చేరుకున్నప్పుడు అక్కడ తినడానికి బంగారం తప్ప ఏమీ లేదట. ఆకలితో అవస్థపడుతున్నప్పుడు కర్ణుడు ఇంద్రుని కలసి వంటగది ఎక్కడా అని అడుగగా..తాను బంగారమే తింటానని, తన పూర్వీకులకు కూడా తాను బంగారాన్నే ఆహారంగా పెట్టానని చెప్పాడట. వారి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగిన తరువాత ఇంద్రుడు కర్ణుడిని 15 రోజులు భూమికి పంపిచాడట. కర్ణుడు ఆ 15 రోజులూ తన పూర్వీకులకు భోజనం, మంచినీరు ఇచ్చాడట.

 

ఫమాడిహానా...
మడగాస్కర్ దేశంలో జరుపుకునే పండగ. దీనికని ప్రత్యేకంగా ఏ రోజునూ వారు కేటాయించలేదు. చలికాలంలో సమాధుల దగ్గరకు వెళ్లి సమాధులలో ఉన్న వారి పూర్వీకుల శవాలను వెలికితీసి..వాటిని శుభ్రపరిచి మళ్లీ సమాధులలో ఉంచుతారు. ఇక్కడి వారి నమ్మకమేమిటంటే శవాలు పూర్తిగా మట్టిలో కలసిపోతేనే మరణించినవారు స్వర్గానికి చేరుకోగలరని..అంతవరకు ఆత్మలు అక్కడే ఉంటాయని వారి నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement