అబ్బాయి కోసం బాత్రూంలో కొట్లాట: విద్యార్థిని మృతి
విల్మింగ్టన్:
హైస్కూలులో విద్యార్థినుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ 16 ఏళ్ల బాలిక మృతిచెందింది. ఈ సంఘటన విల్మింగ్టన్లో డీలవేర్లోని హోవర్డ్ హై స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో గురువారం చోటు చేసుకుంది. అయితే ఓ అబ్బాయి విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణ చెలరేగడానికి కారణమని మిగతా విద్యార్థినులు తెలిపారు. బాధిత బాలిక బాత్ రూం వెళ్లిన సమయంలోనే కొట్లాట ప్రారంభమైందని మరో విద్యార్థిని చెప్పింది. బాధిత బాలిక, మరో బాలిక కలిసి ముందుగా కొట్లాడారు. అయితే తర్వాత అక్కడే ఉన్న మిగతా విద్యార్థినిలు అందరూ కలిసి ఒక్కసారిగా బాధిత బాలికపై పడి పిడిగుద్దులు గుద్దుతూ, అమె పై ఎగిరి దూకడంతో తీవ్రగాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ కొట్లాటలో పాల్గొన్న విద్యార్థినులు ఎలాంటి మారణాయుధాలను ఉపయోగించలేదని స్కూల్ అధికారులు తెలిపారు. విద్యార్థినుల దాడిలో తీవ్రగాయాలైన బాలికను హెలీకాప్టర్లో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే బాలిక మృతి చెందింది.
ఈ సంఘటనపై వీవో-టెక్నో స్కూల్ న్యూ క్యాస్టిల్ కౌంటీజిల్లా విద్యాశాఖ యంత్రాంగం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాలిక తల్లిదండ్రులకు తమ సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు బృందాలు విచారణ ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. విల్మింగ్టన్ మేయర్ డెన్నిస్ విలియమ్స్ బాలిక మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.