పరిష్కారం దిశగా దౌత్యవివాదం!
అమెరికా కోర్టులో హాజరు నుంచి దేవయానికి మినహాయింపు
ఐరాస శాశ్వత మిషన్‌కు బదిలీతో సమితి అధికారిక గుర్తింపు
న్యూఢిల్లీ: భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రాగడె అరెస్టు విషయమై అమెరికా, భారత్‌ల మధ్య తలెత్తిన దౌత్య వివాదం పరిష్కారం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. వీసా అక్రమాల కేసు విచారణ కోసం అమెరికా కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా దేవయానికి మినహాయింపు లభించింది. మరోవైపు.. దేవయానిని న్యూయార్క్‌లోని భారత దౌత్యకార్యాలయం నుంచి అదే నగరంలో గల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని భారత శాశ్వత మిషన్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆమెకు సమితి అధికారిక గుర్తింపు లభించింది. దీంతో ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ లభించినట్లయింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆమెరికా విదేశాంగ శాఖ లాంఛనంగా పూర్తిచేయటమే మిగిలింది. వీసా అక్రమాలు, తన పనిమనిషి సంగీతా రిచర్డ్‌కు తక్కువ వేతనాలు చెల్లించటం ఆరోపణలపై దేవయానిని ఈ నెల 12న నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్ట్ చేయటం, అనంతరం దుస్తులు విప్పి తనిఖీ చేయటం, మాదకద్రవ్యాల నేరస్థులతో పాటు సెల్‌లో నిర్బంధించటం వంటి అవమానకర చర్యలపై భారత్ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. ప్రతిచర్యల్లో భాగంగా అమెరికా దౌత్యాధికారులు నియమించుకున్న భారత ఉద్యోగులు, పనిమనుషులకు సంబంధించి వేతనాలు, ఇతర కీలక సమాచారాన్ని సోమవారం లోగా అందించాలని గడువు విధంచగా అందుకు మరో రోజు సమయం కావాలని అమెరికా ఎంబసీ కోరింది.
సంగీత కుటుంబానికి విమాన చార్జీ చెల్లించిన అమెరికా
దేవయాని పనిమనిషి సంగీత భర్త ఫిలిప్, పిల్లలు జెన్నిఫర్, జతిన్‌లు గత వారం ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ విమాన చార్జీలు చెల్లించిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత ప్రస్తుతం పరారీలో ఉండడం విదితమే. కాగా, అమెరికాలోని భారత దౌత్యవేత్తల పనిమనుషులు(ఇండియా బేస్డ్ డొమెస్టిక్ వర్కర్స్-ఐబీడీఏ) పరారు కావడం కొత్తేమీ కాదని తెలిసింది. గత పదేళ్లలో పన్నెండు మందికిపైగా పరారయ్యారు. వీరిలో పనిమనుషులతోపాటు సెక్యూరిటీ గార్డులూ ఉన్నారు. వీరిలో అమెరికాలో భారత మాజీ రాయబారి మీరా శంకర్ పనిమనిషి కూడా ఉంది. అమెరికా చట్టాల్లోని లొసుగుల వల్ల కొందరు ఐబీడీఏలు ఆ దేశంలోనే ఉండిపోయేందుకు తమ యజమానులపై ఆరోపణలు చేస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని దౌత్యవేత్తలు చెప్పారు.
‘దేవయాని అరెస్టు తీరు హేయం’
దేవయాని విషయంలో తమ దేశ తీరు హేయమైందని అమెరికా మాజీ విదేశాంగ అధికారి గోర్డన్‌జోన్స్ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో రాసిన వ్యాసంలో విమర్శించారు. ఈ ఉదంతంతో సంబంధమున్న అమెరికా మార్షల్స్‌ను విచారించాలని, వారు ఆమెను అవమానించినట్లు తేలితే కఠిన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం విదేశీ సంబంధాల్లో విజ్ఞతతో వ్యహరించాల్సి ఉంటుందని అమెరికన్ వర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రొఫెసర్ స్టీఫెన్‌వ్లాడెక్ అన్నారు.