భర్త ఫిలిప్ తో సంగీత రిచర్డ్
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత్, అమెరికాల మధ్య దాదాపు ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమైన 39 ఏళ్ల దేవయాని ఖోబ్రగడే 1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారిణి. న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఇంట్లో సహాయకారిగా ఉండేందుకు భారత్‌లో ఉన్న సంగీత రిచర్డ్‌ను నెలకు రూ. 30 వేల జీతంతో పనిమనిషిగా పెట్టుకున్నారు. దేవయాని మూల వేతనమే రూ.26 వేలు కావడం ఇక్కడ గమనార్హం. 2012 నవంబర్ 23న సంగీత న్యూయార్క్ వెళ్లారు. 2013 మార్చి వరకు ఏ సమస్యా రాలేదు. ఆ తరువాత ఖాళీ సమయాల్లో వేరే దగ్గర పనిచేసేందుకు అనుమతించాలని పనిమనిషి దేవయానిపై ఒత్తిడి తేవడం ప్రారంభించింది. అలా చేయడం చట్టవ్యతిరేకమని చెప్పి ఆమె అభ్యర్థనను దేవయాని తిరస్కరించారు. జూన్ 21న దేవయాని న్యూజెర్సీ వెళ్లి వచ్చేసరికి సంగీత ఇంట్లోంచి వెళ్లిపోయింది.
ఆ విషయాన్ని దేవయాని అమెరికాలోని విదేశీ వ్యవహారాల కార్యాలయానికి (ఓఎఫ్‌ఎం) తెలియజేయగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు.కుటుంబసభ్యులు మాత్రమే ఫిర్యాదు చేయాలని చెప్తూ పోలీసులు ఆమె ఫిర్యాదును తీసుకోలేదు. పనిమనిషి భర్త ఫిలిప్ కూడా ఈ విషయంలో దేవయానికి సహకరించలేదు. జూలై 1న ఒక మహిళ దేవయానికి ఫోన్‌చేసి.. సంగీతకు అమెరికా పౌరసత్వం ఇప్పించి భారీ మొత్తంలో పరిహారం ఇస్తే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కూడా దేవయాని విదేశీ వ్యవహారాల కార్యాలయానికి, పోలీసులకు తెలియజేశారు. జూలై 5న వేధింపులు, బ్లాక్‌మెయిల్, డబ్బులు డిమాండ్ చేయడం తదితర ఆరోపణలతో పనిమనిషిపై దేవయాని న్యూయార్క్ పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలోనూ పనిమనిషి, ఆమె భర్తపై కేసు పెట్టారు.
మూడురోజుల తరువాత న్యూయార్క్‌లోని ఇమ్మిగ్రేషన్ లాయర్ నుంచి తమ ఆఫీస్‌కు రావాల్సిందిగా దేవయానికి ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లిన తరువాత పనిమనిషికి 10 వేల డాలర్లు ఇచ్చి, ఆమె అధికారిక వీసాను సాధారణ వీసాగా మార్చి, అమెరికాలో నివసించే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ తరువాత పనిమనిషిని కాన్సులేట్ కార్యాలయంలో హాజరు పర్చాల్సిందిగా జూలై 30న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఓఎఫ్‌ఎంకు లేఖ రాశారు. అది మీ అంతర్గత సమస్య అంటూ సెప్టెంబర్ 21న అమెరికా ఎంబసీ జవాబిచ్చింది. సెప్టెంబర్ 20న దేవయానిపై విదేశీ కోర్టులకు ఫిర్యాదు చేయవద్దని పనిమనిషి సంగీతను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ 19న ఢిల్లీ కోర్టు సంగీతపై నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. తక్షణమే సంగీతను అరెస్ట్ చేయాలంటూ ఆ వారంటును అమెరికా ఎంబసీకి డిసెంబర్ 6న పంపించారు. వింతేమిటంటే, ఆ తరువాత 4 రోజులకు సంగీత భర్త, వారి పిల్లలకు అమెరికా ‘టీ’ వీసా జారీ చేసింది. మనుషుల అక్రమ రవాణా బాధితులు, వారి దగ్గరి బంధువులకు అమెరికాలో కొన్ని రోజులుండి, పనిచేసుకునేలా.. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలన్న షరతుతో ఆ వీసాలను జారీ చేస్తారు. సంగీత అత్త గతంలో భారత్‌లో విధులు నిర్వహించిన అమెరికా సీనియర్ దౌత్యవేత్త దగ్గర పనిచేశారు. మామ ఇప్పటికీ భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్నారు.
డిసెంబర్ 11న వీసా మోసానికి పాల్పడ్డారని, పనిపనిషి వేతనానికి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ అమెరికాలోని దౌత్యాధికారుల భద్రత వ్యవహారాలశాఖకు చెందిన ప్రత్యేక ప్రతినిధి దేవయానిపై కేసు పెట్టారు. డిసెంబర్ 12న తన ఇద్దరు పిల్లలను స్కూల్ వద్ద దింపడానికి వెళ్తుండగా, నడిరోడ్డుపై యూఎస్ మార్షల్స్ ఆమెను అరెస్ట్ చేసి, చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. ఆ తరువాత విచారణ పేరుతో ఆమెతో అతి హేయంగా ప్రవర్తించారు. దుస్తులు విప్పించి, అణువణువూ తడిమి, దారుణంగా తనిఖీ చేశారు. ఆమెకు ఉన్న దౌత్యపరమైన రక్షణనూ పట్టించుకోకుండా.. స్మగ్లర్లు, డ్రగ్స్ వ్యసనపరులు, ఇతర నేరస్తులున్న సెల్‌లో ఉంచారు.
వెట్టిచాకిరీ నిజమేనా?
అయితే, పనిమనిషితో వెట్టిచాకిరి చేయించుకున్నారనే విమర్శలు కూడా దేవయానిపై వస్తున్నాయి. ఆమెపై అక్కడ వేసిన కేసులో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అమెరికా నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 19 గంటలు పనిచేయించుకున్నారని, తక్కువ వేతనం ఇచ్చారని, అమెరికా ప్రభుత్వానికి చూపవద్దనే షరతుతో.. తక్కువ వేతనానికి సంబంధించిన ఒప్పందంపై ఏర్‌పోర్ట్‌కు వెళ్లేముందు సంతకం చేయించుకున్నారని అందులో పేర్కొన్నారు. నెలకు రూ. 30 వేల రూపాయల(అప్పటి ఎక్స్‌చేంజ్ రేట్ ప్రకారం 573 డాలర్లు) వేతనం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న దేవయాని.. సంగీత వీసా దరఖాస్తుపై మాత్రం అమెరికా నిబంధనలకు అనుగుణంగా నెలకు దాదాపు 4,500 డాలర్లు చెల్లిస్తున్నట్లుగా పేర్కొనడం గమనార్హం. అలాగే, రూ. 30 వేల జీతం గురించి వీసా ఇంటర్వ్యూ సమయంలో ప్రస్తావించవద్దని కూడా సంగీతను ఆమె హెచ్చరించినట్లు ఆరోపణలున్నాయి.