మరో ఇద్దరు ఉగ్రవాదులనుమట్టుబెట్టిన బంగ్లా పోలీసులు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్‌పై గత నెలలో జరిగిన ఉగ్ర దాడి సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)ని బంగ్లా భద్రతా బలగాలు శనివారం హతమార్చాయి. అతడితో పాటు ఇద్దరు అనుచరులు చనిపోయారు. జూలై 1న ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీపై ఉగ్ర దాడిలో ఒక భారతీయురాలు, 16 మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తమీమ్. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది.
భద్రతా బలగాల అదుపులో ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన ఓ ఉగ్రవాది ఢాకా శివార్లలోని నారాయణ్‌గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం ఇవ్వడంతో ఆపరేషన్ చేపట్టినట్టు కౌంటర్ టైజమ్ యూనిట్ చీఫ్ మోనీరుల్ ఇస్లాం చెప్పారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో లోపలి నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురూ చనిపోయారు. ఈ ఆపరేషన్ సుమారు గంట పాటు సాగిందని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి కొన్ని గ్రెనేడ్లు, ఓ పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, తమీమ్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి బంగ్లా పోలీసులు 20లక్షల బంగ్లా టాకాల రివార్డును ప్రకటించారు.