హవ్వా.. చైనా జనాలకు చీమకుట్టినట్లైనా లేదు
బీజింగ్: మానవత్వం భారతదేశంలో రానురాను తగ్గిపోతుందని గగ్గోలుపడిపోతుంటాంకానీ చైనాతో పోల్చుకుంటే మాత్రం మనమే నయం అనిపిస్తుందేమో. అవును.. చైనాలో మానవత్వం ఎప్పుడో మంటగలిచిపోయిందని ఈ విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది. చైనాలో సాధారణంగా చిన్నపిల్లల కిడ్నాప్లు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ విషయం ఎంతో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అసలు ప్రజలకు ఇలాంటి అంశాలపై ఎంతమేరకు ఆందోళన ఉంటుందో, ఎలా తమ బాధ్యతను నిర్వర్తిస్తారో తెలుసుకునేందుకు కొందరు యువకులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు.
ఒక చిన్నపిల్లాడిని బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో నిల్చోబెట్టి అందరూ చూస్తుండగా క్లోరో ఫామ్ ముక్కుకు పెట్టి ఎత్తుకెళ్లిపోతున్నట్లుగా ప్రవర్తించారు. ఇలా పార్క్లలో, రెస్టారెంట్లలో, వీధుల్లో, కళాశాల వద్ద పరిపరి విధాలుగా కిడ్నాప్ చేస్తున్నట్లుగా నటించారు. కానీ, ఇదంతా చూస్తున్న ఆ చుట్టుపక్కలవారు కనీసం ఆ కిడ్నాపర్ను అడ్డుకోలేదు కదా... కనీసం ఆందోళన కూడా పడలేదు. మాకే సంబంధం లేదన్నట్లుగా కనీసం చీమకుట్టినట్లయినా లేకుండా కనిపించారు. ఏ ఒక్కరూ అతడిని గల్లా పట్టుకొని అడుగుతారేమోనని ఆశగా చూసిన అంతా బాధ్యతా రహితంగానే కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.