వాషింగ్టన్: కొన్ని కుటుంబాల్లో దంపతులు విడాకులు తీసుకోవటానికి లేదా విడిపోవటానికి గల కీలక కారణం తెలిసిపోయింది. విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు కూడా తమ భాగస్వామితో విడిపోయేందుకు గల అవకాశాలను పరిశీలించిన పరిశోధకుల బృందం అందుకు జన్యువులే కారణంగా తేల్చారు. ఒక ప్రత్యేకమైన జీన్స్ వల్లనే కొన్ని కుటుంబాల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని కనిపెట్టారు. దత్తత కుటుంబాల్లో ఉన్న పిల్లలు తమను కన్నవారి మాదిరిగానే విడాకులు తీసుకునే సందర్భాలు ఎక్కువగా ఉన్నట్లు యూఎస్‌లోని వర్జినియా కామన్‌వెల్త్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు.
ఇటువంటి పిల్లలు తమను దత్తత తీసుకున్న దంపతుల మాదిరిగా కలిసి ఉండలేక పోతున్నారని స్వీడన్ జనగణన రికార్డుల ఆధారంగా కనుగొన్నారు. ఫ్యామిలీ రికార్డుల ప్రకారం... విడిపోయిన దంపతుల పిల్లలు తమ తల్లిదండ్రుల మాదిరిగానే భాగస్వామితో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారని, కలిసి ఉండటంపై నిబద్ధత, సానుకూల దృక్పధం చూపలేకపోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల మధ్య ఘర్షణను చూస్తూ పెరిగిన పిల్లలు అవే లక్షణాలను అలవర్చుకుంటున్నారని అంటున్నారు. ఇదే ఒరవడి తరాలుగా కొనసాగుతూ వస్తోందని భావిస్తున్నారు. కుటుంబ పరిణామంలో ఇది కీలకమైన ఆవిష్కరణ అని తెలిపారు. విడాకుల జీన్స్ ఉన్న వారిని వైద్యుల సరైన పర్యవేక్షణ, మార్గదర్శనం ద్వారా సరైన మార్గంలో నడిచేలా చేసే వీలుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment