ట్రంప్ ఆరోగ్యంపై డాక్టర్ ఏం చెప్పాడంటే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై ప్రత్యర్థి నేతలు పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ట్రంప్ వ్యక్తిగత డాక్టర్, ఫిజిషియన్ హెరాల్డ్ బార్న్స్టీన్ ఓ నివేదిక ఇచ్చారు. ఇందులో 70 ఏళ్ల ట్రంప్ అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రంప్ మానసిక ఆరోగ్యం అమోఘం అంటూ కితాబిచ్చారు. ఒకవేళ అధ్యక్ష పదవికి ఎన్నికైతే అతడే అత్యంత ఆరోగ్యవంతమైన ప్రెసిడెంట్ అంటూ పేర్కొన్నాడు. గత ఏడాది ట్రంప్ 15 పౌండ్ల బరువు తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా డాక్టర్ ప్రస్తావించారు.
డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్(68) తన ప్రత్యర్థి ట్రంప్ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. రిపబ్లికన్ పార్టీ సభ్యులు మాత్రం హిల్లరీ ఆరోగ్యం సరిగా లేదని, ఆమె అమెరికా అధ్యక్షపదవిని నిర్వహించేంత సమర్థురాలు కాదని విమర్శిస్తున్నారు.