
ఫిబ్రవరి 4న ప్రేమ పోటీల ప్రసారం
తనంటే అమ్మాయికి ప్రేమ ఉంన్నదీ లేనిదీ 'లవ్ మీటర్' ద్వారా తెలుసుకుంటాడు 'అపరిచితుడు'లో రెమో. నిజజీవితంలో ప్రేమను కొలిచే అలాంటి మ్యాజిక్ సాధనాలేవీ లేవుగానీ శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రేమ గాఢతను నిరూపించవచ్చు. ప్రియమైన వ్యక్తిని చూడటంతోనే విడుదలయ్యే ఆక్సిటోసిన్(ప్రేమను కలిగించే హార్మోన్లు) ప్రభావానికి 'ఇంకా దగ్గరికి వెళ్లు' అని మెదడు ప్రతిస్పందనలు పంపుతుంది. ఈ రసాయనిక చర్య కేవలం స్వజాతి జీవుల్లోనే కాక విభిన్న జీవుల మధ్య కూడా ఒకేరకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఈ క్రమంలో మనిషిని అమితంగా ప్రేమించే జంతువు ఏది? అనే దిశగా జరిగిన ప్రయోగాల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. మనిషిని ప్రేమించడంలో విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శునకరాజాలు మార్జాలాలను తోసిరాజన్నాయి. అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ పాల్ జాక్ పరిశోధన ఇలా చేశారు..
10 పిల్లులు, 10 కుక్కలను ఎంచుకుని, అవి వాటివాటి యజమానులతో విడివిడిగా గడిపినప్పటి దృశ్యాలు రికార్డ్ చేయడమేకాక వాటి మెదళ్లలో చోటుచేసుకున్న రసాయన ప్రక్రియలను కూడా పరిశీలించారు. యజమానికి దగ్గరగా ఉన్నప్పుడు కుక్కలో 57.2 శాతం ఆక్సిటోసిన్ విడుదలకాగా, పిల్లిలో మాత్రం కేవలం 12 శాతమే విడుదలైంది. దీన్నిబట్టి యజమానిని ప్రేమించే పోటీల్లో కుక్కలే విజేతలుగా నిలిచాయి. ఈ ప్రయోగానికి సంబంధించిన కార్యక్రమం ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీలో ఫిబ్రవరి 4న ప్రసారంకానుంది.