
మద్యం మత్తులో భర్తను రేపిస్టుగా భావించి..!
మాస్కో: మద్యం మత్తులో భర్తను దెయ్యంగా భావించిన ఓ మహిళ మూడో అంతస్తు నుంచి దూకేసింది. దెయ్యం తనను రేప్ చేసి చంపేస్తుందేమోనన్న భయంతో ఈ చర్యకు పాల్పడింది. రష్యాలోని తులున్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.
మద్యాన్ని సేవించిన ఆ మహిళకు తన గది తలుపును కొడుతున్న చప్పుడు వినిపించడంతో భయపడింది. తలుపు వెనుక ఉన్నది దెయ్యం అయి ఉంటుందని, అది తనను అత్యాచారం చేసి.. చంపడానికి వచ్చిందని ఆమె భయపడింది. అంతే ఆ దెయ్యం నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు కిటికీ నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో కిటికీ నుంచి ఆమె జారి మంచులో పడిపోయింది. స్థానిక టీవీ కంపెనీ ప్రతినిధులు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. అసలు ఏమైందని ఆమెను వైద్యులు ఆరా తీయగా.. తలుపు బయట ఉన్న వ్యక్తి దెయ్యం అయి ఉంటుందని, అది తనపై దాడి చేసేందుకే వచ్చాడని తనకు అనిపించిందని, అందుకే తాను కిటికీ నుంచి దూకేశానని ఆమె తెలిపింది.
'వారం రోజులుగా నిరాటంకంగా మద్యాన్ని తాగుతుండటంతో ఆమెలో మానసిక సమస్య తలెత్తింది. అందుకే తాగిన మత్తులో కిటికీ నుంచి దూకేసింది. నిజానికి ఆ సమయంలో ఆమె భర్త ఆఫీసు నుంచి మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చాడు. అతడిని ఆమె దెయ్యంగా భావించింది' అని పోలీసు అధికార ప్రతినిధి ఇగర్ మార్దాటినెంకో తెలిపారు.