కాన్సులేట్‌పై దాడిలో 8 మంది మృతి
అఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్ పట్టణంలో భారత రాయబార కార్యాలయమే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఒక పోలీసు, ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. భారతీయ దౌత్యవేత్తలు, కార్యాలయ ఉద్యోగులంతా సురక్షితంగా ఉన్నారు. ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో 19 మంది పౌరులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
నాన్‌గర్హర్ రాష్ట్ర రాజధాని అయిన జలాలాబాద్ నగరం తరచు తాలిబన్ ఉగ్రవాదుల దాడులకు లక్ష్యంగా మారుతుంది. 2013లో కూడా భారత కాన్సులేట్‌పై ఒకసారి దాడి జరిగింది. అయితే, బుధవారం నాటి దాడి చేసింది తామంటూ ఎవరూ ఇంతవరకు ప్రకటించుకోలేదు. ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ కాన్సులేట్ ముందుగేటు వద్దకు చేరుకుని, తనను తాను పేల్చుకున్నాడు. దాంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఆ సమయం చూసుకుని మిగిలిన ఉగ్రవాదులు భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసు అధికారి ఫజల్ అహ్మద్ షిర్జాద్ తెలిపారు.
మజార్-ఇ-షరీఫ్ నగరంలో భారత దౌత్యకార్యాలయంపై గత జనవరిలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 2008, 2009, 2013, 2014 సంవత్సరాల్లో కూడా కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం పై ఉగ్రవాద దాడులు జరిగాయి. 2013 నాటి ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 9 మంది పౌరులు చనిపోయారు.