కంటిలో గుచ్చుకున్న ఐలైనర్
బ్యాంకాక్ : టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ యువతి కంటికి ‘ఐలైనర్ పెన్సిల్’ సహాయంతో మెరుగులు దిద్దుతుండగా.. ఐలైనర్ పెన్సిల్ కాస్తా కంటిలో గుచ్చుకుంది. సగానికి పైగా పెన్సిల్ కంటిలోకి చొరబడటంతో భరించలేని నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురైందా యువతి. ఈ సంఘటన సోమవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన 20 ఏళ్ల యువతి టాక్సీలో ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం నిదానంగా కదులుతోంది. స్నేహితులను కలవాలన్న తొందరలో ఉన్న ఆమె బ్యాగులో ఉన్న ఐలైనర్‌ను తీసి కంటికి మెరుగులు దిద్దుకోవటం ప్రారంభించింది. ఇంతలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ కాస్తా ముందున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ముందున్న సీటుకు తగిలి ఐలైనర్ పెన్సిల్ కంటిలోకి చొచ్చుకెళ్లింది. పెన్సిల్ కంట్లో గుచ్చుకోవటంతో భరించలేని నొప్పి కారణంగా ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది.
ఆమె పరిస్థితి గమనించిన టాక్సీ డ్రైవర్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్‌లో ఆమెను దగ్గరలోని ‘రాజవితి’ హాస్పిటల్‌కు తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు యువతి కంటి నుంచి పెన్సిల్‌ను తొలగించారు. ‘రాజవతి’ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. కంటిలోని ముఖ్యమైన భాగాలకు ఎలాంటి నష్టం కలుగకపోవటంతో ఆమె కంటిచూపుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నపుడు మేకప్ వేసుకునే వాళ్లకు ఇదొక గుణపాఠమని, కదులుతున్న కారులో ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు ఊహించనివని, అన్నింటికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment