ఎఫ్‌బీ మొబైల్ యాప్ యూజర్లకు షాక్!
మీరు ఫేస్‌బుక్ మొబైల్ యాప్ వాడుతున్నారా? ప్రత్యేకంగా మెసెంజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకుండా అప్పుడప్పుడు మొబైల్ యాప్‌లోనే మీరు మెసెజ్‌లు పంపిస్తున్నారా? అయితే మీకు ఇది షాక్ కలిగించే న్యూస్. ఇక ఎఫ్‌బీ మొబైల్ యాప్‌లోనే మెసెజ్‌లు పంపుకొనే సదుపాయం ఉండబోదట. ఎఫ్‌బీకి చెందిన మెసెంజర్ యాప్‌లోనే సందేశాలు పంపించుకోవాలట. మెసెంజర్ యాప్ డౌన్‌లోడ్లను పెంచుకోవడానికి ఫేస్‌బుక్ ఈ ఎత్తు వేసినట్టు తాజాగా టెక్‌క్రంచ్.కామ్ వెల్లడించింది. ఇప్పటికే ఈ మేరకు ఫేస్‌బుక్ తన యూజర్లు చాలామందికి సమాచారం కూడా ఇచ్చిందని, ' యాప్‌లోని మీ సంభాషణలను మెసెంజర్‌కు బదిలీ చేసినట్టు' తెలియజేసిందని ఆ వెబ్‌సైట్ తెలిపింది.
ఈ సమాచారాన్ని పట్టించుకోకపోతే.. మెసెంజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని ఫేస్‌బుక్ యూజర్లను నేరుగా అడిగే అవకాశముందని పేర్కొంది. సందేశాలు పంపేవిషయంలో ఉత్తమమైన సేవలు అందుకోవాలంటే అందుకు మెసెంజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనని ఫేస్‌బుక్ పేర్కొన్నట్టు ఆ సైట్ ఓ కథనంలో తెలిపింది. అయితే, చాలామంది మొబైల్ ఫోన్లలో తగినంత మెమరీ సామర్థ్యం లేకపోవడంతో మొబైల్ యాప్ లేదా మెసెంజర్ ఏదొ ఒక్కటే డౌన్‌లోడ్ చేసుకొని వాడుతున్న సంగతి తెలిసిందే.
ఇక యూజర్లు పెట్టే పోస్టులను విశ్లేషించేందుకు 'డీప్ టెక్స్ట్' పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఫేస్‌బుక్ ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఆ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే దాదాపు 20 భాషల్లో పోస్టులను కచ్చితంగా విశ్లేషించే అవకాశముంటుందని ఫేస్‌బుక్ తెలిపింది.