
వైరలవుతోన్న రెజ్యూమ్
లండన్ : రెజ్యూమ్ అనేది మన ప్రతిభ గురించి అవతలి వారికి తెలియజేసి, మన గురించి ఒక సదాభిప్రాయాన్ని ఏర్పర్చడం కోసం తయారుచేసేది. అందుకే రెజ్యూమ్‌లో ఎవరి గురించి వారు కాస్తా డబ్బా కొట్టుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ తండ్రి రాసిన రెజ్యూమ్‌ని చూస్తే జాబ్ మాట దేవుడెరుగు.. కనీసం ఇంటర్వ్యూకు కూడా పిలవరు. అంత దారుణంగా ఏం రాశాడా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి. బ్రిటన్‌కు చెందిన ఒక యువతి తన కోసం రెజ్యూమ్ రాసివ్వమని తన తండ్రిని అడిగింది.
అందుకు తండ్రి కూతురు కోసం అద్భుతమైన రెజ్యూమ్‌ని తయారు చేసిచ్చాడు. ఆ తండ్రి రాసిన రెజ్యూమ్ కూతురుకు జాబ్ తెచ్చిపెడుతుందో లేదో తెలీదు కానీ నెటిజన్లను మాత్రం కడుపుబ్బ నవ్విస్తోంది. అయ్యో కూతురు గురించి నలుగురు నవ్వుకునేలా రాస్తాడా అంటూ కోప్పడకండి. ఎందుకంటే ఆ తండ్రి తన కూతురు గురించి చాలా నిజాయితీగా.. నిజాలు మాత్రమే రాసాడు. దాంతో సదరు రెజ్యూమ్ ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఇంతకూ ఆ రెజ్యూమ్‌లో ఏం ఉందంటే.. క్వాలిఫికేషన్ వివరాల దగ్గర కూతురుకి ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయనేది మాత్రమే కాక, ఎన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్ అయ్యిందనే విషయాన్ని కూడా రాశాడు. బాధ్యతల దగ్గర.. చెప్పిన మాట వినకపోవడం, ఫేస్‌బుక్‌లో బ్రౌజ్ చేయడం, ముఖ్యమైన పత్రాలను పోగొట్టడం, విలువైన సమాచారాన్ని శత్రువులకు చేరవేయడం అని తెలిపాడు. ఇక విధుల్లో భాగంగా బంగారం గురించి అన్వేషిస్తూ.. తవ్వకాలు జరపడం, తల ఎగరేయడం, ఇతరుల పట్ల దారుణంగా ప్రవర్తించడం అని రాశాడు. ఇక వ్యక్తిగత నైపుణ్యాల్లో బద్దకస్తురాలు, మొద్దు, జగమొండి, గర్వంగా ప్రవర్తిస్తుంది అని తెలిపాడు.
అయితే తండ్రి తన గురించి ఇంత నిజాయితీగా రెజ్యూమ్‌ని తయారు చేయడంతో కూతురు కూడా అంతే నిజాయితీగా ఆ రెజ్యూమ్‌ని ఇంటర్‌నెట్‌లో షేర్ చేసింది. దాంతో నెటిజన్లు ఈ రెజ్యూమ్‌ని గోల్డ్ అంటూ, ఆమె తండ్రిని ఫాదర్ ఆఫ్ ద ఇయర్‌గా కీర్తిస్తూ కామెంట్ చేస్తున్నారు.