న్యూఢిల్లీ : వివాదాస్పద పోస్టులకు చెక్ పెడుతూ కంటెంట్ ఆధునీకరణ కోసం మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్ ప్రకటించిన నూతన పర్యవేక్షక బోర్డు పనితీరుపై ఆసక్తి నెలకొంది. ఫేస్‌బుక్ సుప్రీంకోర్టుగా చెబుతున్న ఈ పర్యవేక్షక బోర్డుతో సోషల్ మీడియా ప్రక్షాళన సాధ్యమా అనే హాట్ డిబేట్ సాగుతోంది. 27 దేశాలకు చెందిన 20 మంది సబ్యులతో ఏర్పాటైన ఈ బోర్డులో డెన్మార్క్ మాజీ ప్రధాని హీలీ స్మిత్, నోబెల్ గ్రహీత తవకల్ కర్మన్, నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూర్ వీసీ సుధీర్ కృష్ణస్వామి వంటి ప్రముఖలకు ఈ బోర్డులో చోటుకల్పించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వేదికల్లో కంటెంట్‌ను అనుమతించడంపై మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయాలను సైతం తిరగతోడే అధికారం ఈ బోర్డుకు కల్పించారు.
ఫేస్‌బుక్ కంటెంట్ ఆధునీకకరణ వ్యూహంపై కొన్నేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌బీ సుప్రీంకోర్టుగా చెప్పబడుతున్న ఈ పర్యవేక్షక బోర్డుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌లు సురక్షిత వేదికలుగా మారతాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బోర్డు సభ్యులు నెలలో కేవలం 15 గంటలు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఈ సామాజిక మాధ్యమాలపై 300 కోట్ల యూజర్ల బేస్ ఉండటంతో కంటెంట్ పర్యవేక్షణ సంక్లిష్టమవుతుందన్నది నిపుణుల అంచనా. బోర్డు సభ్యులు పూర్తి కాలం పనిచేసినా పెద్దసంఖ్యలో కంటెంట్‌పై ఫిర్యాదుల పరిష్కారంలో మరింత జాప్యం అనివార్యమని తక్షశిల ఇనిస్టిట్యూషన్‌కు చెందిన పాలసీ విశ్లేషకులు రోహన్ సేథ్ పేర్కొన్నారు.
చదవండి : త్వరలో వాట్సాప్ అద్భుత ఫీచర్
బోర్డు పూర్తికాలం పనిచేసినా కేవలం హై ప్రొఫైల్ కేసుల పర్యవేక్షణే కొలిక్కిరావడం కష్టమని, సాధారణ కంటెంట్‌కు సంబంధించి రొటీన్ కేసులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతాయన్నది నిపుణుల అంచనా. ఫేస్‌బుక్ 130 మిలియన్ డాలర్లతో ఏర్పాటుచేసిన పర్యవేక్షక బోర్డు ఏదైనా కంటెంట్ సమస్యాత్మకమైన సందర్బంలోనే పరిగణనలోకి తీసుకుంటుంది. సమస్మాత్మక కంటెంట్‌ను ముందుగానే పసిగట్టి నిరోధించే అవకాశాలు పరిమితం. ఏదైనా పోస్ట్ పర్యవేక్షక బోర్డు నియమాలకు విరుద్ధంగా ఉన్నా అలాంటి యూజర్‌పై తీవ్ర జరిమానా విధించే అవకాశం కానీ, ఫేస్‌బుక్ జైల్లో వారిని కూర్చోపెట్టే పరిస్థితి కానీ లేదు. దిగ్గజాలతో కూడిన కమిటీని ఫేస్‌బుక్ ఏర్పాటు చేసినంత మాత్రాన ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రాంలు ఇక సురక్షిత వేదికలుగా మారతాయని ఆశించలేం. అయితే ఒకరి భావప్రకనా స్వేచ్ఛ మరొకరి మనోభావాలను గాయపరచకుండా ఒక సమతూకం పాటించేలా సోషల్ మీడియా వేదికలను కొంత మేర కట్టడి చేస్తాయని భావించినా ఇక ఏవైనా పోస్టులను తొలగిస్తే అది పర్యవేక్షక కమిటీ నిర్ణయమని ఇందులో తమ పాత్ర ఏమీ లేదని ఎఫ్‌బీ తప్పించుకునే వెసులుబాటూ ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment