చిన్నారుల్లో క్షీణిస్తున్న ఫిట్‌నెస్
లండన్: నేటి తరం చిన్నారుల్లో ఫిట్‌నెస్ స్థాయి నానాటికీ క్షీణిస్తోందని ఓ అధ్యయనంలో తేలింది. ఇది గతంలో అనుకున్నదాని కంటే మరింత ఆందోళనకర స్థాయిలో ఉందని ఎస్సెక్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 2009లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం గడిచిన పదేళ్లలో చిన్నారుల్లో ఫిట్‌నెస్ స్థాయి 8 శాతం క్షీణించిందని వెల్లడైంది. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో రుజువైంది. మునుపటి కంటే ఈసారి తక్కువ బరువు గల 300 మంది పిల్లల్ని ఎంచుకున్నారు. వీరంతా 10 నుంచి 11 ఏళ్లవారు.
వీరిలో దాదాపు అందరూ శరీర ద్రవ్యరాశి సూచీ (బీఎమ్‌ఐ) తక్కువగా ఉన్నవారే. అయితే ఆశ్చర్యకరంగా వీరు వేగంగా పరుగెత్తలేకపోయారట. దీనికి కారణం వీరిలో గుండె, ఊపిరితిత్తులు ఫిట్‌గా లేకపోవడమే అంటున్నారు పరిశోధకులు. గత అధ్యయనంలో ఊబకాయులు ఉన్నప్పటికీ వారి ఫిట్‌నెస్ స్థాయి మెరుగ్గా ఉందని, ప్రస్తుత చిన్నారుల్లో అది లోపించిందనీ.. దీంతో ఊబకాయానికి, ఫిట్‌నెస్‌కీ సంబంధం లేదనేది స్పష్టమవుతోందని అధ్యయన కర్త గావిన్ సాండర్‌కాక్ అన్నారు.