భారత కాన్సులేట్ పై ఉగ్రదాడి
అఫ్ఘాన్‌లో విరుచుకుపడ్డ నలుగురు ముష్కరులు
ఎదురు కాల్పుల్లో హతం, సిబ్బంది క్షేమం
ఖండించిన ప్రణబ్, మన్మోహన్, మోడీ
మోడీకి కర్జాయ్ ఫోన్, విచారణకు హామీ
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హెరాత్ ప్రావిన్సులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే భారత రాయబార కార్యాలయంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ల వంటి భారీ మారణాయుధాలతో నలుగురు ముష్కరులు తెల్లవారుజామున ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో పాటు బాంబుల వర్షం కురిపించారు. తొమ్మిది గంటల సుదీర్ఘ ఎన్‌కౌంటర్ అనంతరం ఒకరు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జరిపిన కాల్పుల్లో, మిగతా ముగ్గురు అఫ్ఘాన్ సిబ్బంది కాల్పుల్లో హతమయ్యారు. కాన్సులేట్ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్టు అఫ్ఘాన్‌లో భారత రాయబారి అమర్ సిన్హా తెలిపారు. దాడి సమయంలో అందులో తొమ్మిది మంది భారతీయులతో పాటు స్థానిక సిబ్బంది కూడా ఉన్నారన్నారు. దాడికి ఇంకా ఏ గ్రూపూ బాధ్యత ప్రకటించుకోకున్నా, ఇది పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్ర తండాల పనేనని భారత్ అనుమానిస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించిన నేపథ్యంలో అవి ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు దిగి ఉంటాయని భావిస్తోంది. దీన్ని అఫ్ఘాన్ సరిహద్దులకు ఆవలి నుంచి జరిగిన దాడిగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కూడా అభివర్ణించడం గమనార్హం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, మోడీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దీటుగా తిప్పి కొట్టి ముష్కరులను తుదముట్టించిన భారత, అఫ్ఘాన్ భద్రతా దళాలను వారు ప్రశంసించారు. తొమ్మిది గంటల దాడి సందర్భంగా ఏ సమయంలోనూ ధైర్యం కోల్పోని కాన్సులేట్ సిబ్బందికి జోహార్లంటూ కొనియాడారు. అఫ్ఘాన్‌కు భారత్ అందిస్తున్న సాయాన్ని ఇలాంటి ఉదంతాలు అడ్డుకోజాలవని ప్రణబ్ స్పష్టం చేశారు. దేశ భద్రతకు హాని తలపెట్టజూసే ఇలాంటి కుయత్నాలకు తగిన జవాబు చెప్పేలా నిత్యం సన్నద్ధంగా ఉండాల్సిందిగా భారత భద్రతా దళాలకు ఆయన పిలుపునిచ్చారు.
అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. దీన్ని ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అఫ్ఘాన్‌లోని భారత కార్యాలయాల పరిరక్షణకు పూర్తి చర్యలు చేపట్టడమే గాక దాడిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఆయనకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్ఘాన్‌తో స్నేహానికి, ఆ దేశ పునర్నిర్మాణానికి, శాంతి, సుస్థిరతల స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత రాయబార కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని కర్జాయ్ తనకు హామీ ఇచ్చినట్టు ట్విట్లర్లో మోడీ పేర్కొన్నారు. దాడిపై అఫ్ఘాన్‌లోని భారత రాయబారి అమర్ సిన్హాతో మాట్లాడారు. ఉగ్ర దాడులను ఎదుర్కొనే విషయంలో సంబంధిత విభాగాల మధ్య సమన్వయం తదితరాలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు శుక్రవారం సమీక్షించారు. హెరాత్ ప్రావిన్సులో సల్మా హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ వంటి పలు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టింది.
అఫ్ఘాన్‌లోని మన రాయబార కార్యాలయాలపై గతంలో జరిగిన ఉగ్ర దాడులు
2007 జూలై 7: జలాలాబాద్‌లోని భారత రాయబార
కార్యాలయంపై దాడి. 41 మంది మృతి
2008 జూలై 7: కాబూల్ కార్యాలయంపై దాడి.
66 మంది మృతి
2008 జూలై 9: జలాలాబాద్ కార్యాలయంపై దాడి.
ఇద్దరు భారతీయులతో పాటు ఆరుగురి మృతి
2009 అక్టోబర్ 8: కాబూల్ కార్యాలయంపై దాడి.
17 మంది మృతి
2010 ఫిబ్రవరి 26: కాబూల్ కార్యాలయంపై దాడి
2013 ఆగస్టు 3: జలాలాబాద్ కార్యాలయంపై దాడి. ఎనిమిది మంది పిల్లల మృతి