
పారిస్ : కష్టపడి పనిచేస్తే ఎవరికైనా జీతం పెరుగుతుంది లేదా ప్రమోషన్ వస్తుంది...కానీ ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తికి జరిమానా పడింది. అదేంటి కష్టపడి పనిచేస్తే.. జరిమానా ఎందుకు విధించారు అనుకుంటున్నారా? ఫ్రాన్స్‌లో అంతేనట. వివరాల్లోకి వెళ్తే ఫ్రాన్స్‌లో ప్రతి ఒక్కరూ వారానికి ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. కచ్చితంగా ఒక రోజు సెలవు తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికీ ఇదే నియమం వర్తిస్తోంది. అయితే ఈ నియమం పాటించని బేకరీ యజమాని సెడ్రిక్ వైవ్రికి అక్కడి ప్రభుత్వం 3వేల యూరోల జరిమానా విధించింది.
వెవ్రి పారిస్‌కు 120 మైళ్ల దూరాన ఉన్న లూసిగ్ని సర్ బార్స్‌లో లెక్ బెకరీని నిర్వహిస్తున్నాడు. రాబోయే వేసవి రద్ధీ దృష్టా ముందుగానే పెద్ద మొత్తంలో క్రిసాంట్స్, బగెట్స్‌ని తయారు చేసి పెట్టుకోవాలని భావించాడు. అందుకోసం వారంలో ఏడురోజుల పాటు పనిచేయడం ప్రారంభించాడు. కానీ అక్కడి స్థానిక చట్టాల ప్రకారం చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా వారంలో ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. ఈ చట్టాన్ని రోజువారి వేతనం కోసం పనిచేసే కూలీలకు ఒక రోజు పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించడానికి, శ్రమ దోపిడి నుంచి కాపాడటం కోసం రూపొందించారు.
సాధరణంగా బేకరిల్లో పని మొత్తం రాత్రిపూటే జరుగుతుంది. యజమానుల పని ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. అందుకని యజమానులు వారంలో ఏడు రోజులు పని చేస్తానంటే అందుకు అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకే వైవ్రీకి జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం. దీనిపై టౌన్ మేయర్ క్రిస్టియాన్ బ్రాన్లే స్పందిస్తూ... ‘వేసవిలో వచ్చే సందర్శకులే మాకు ప్రధాన ఆదాయ వనరు. ఒక్క రోజు వ్యాపారాన్ని మూసివేస్తే మాకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఇలాంటి చట్టాలన్నీ మా వ్యాపారాలకు ఆటంకంగా మారాయి’ అని అన్నారు. ఇక్కడి ప్రజలు కూడా వైవ్రీకే మద్దతు ఇస్తున్నారు. వారంలో ఏడు రోజులు పనిచేయాలనే వైవ్రీ వాదనను సమర్థిస్తూ దాదాపు 500 మంది సంతకాలు చేశారు. అయినప్పటికీ వైవ్రీ జరిమాన చెల్లించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment