
లండన్ : ఈ ప్రకృతి ఎంత అందమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా! చూడటానికి అందంగా ఉండి ప్రాణాలు తీసే జీవులు, మొక్కలు అనేకం ఉన్నాయి ఈ సృష్టిలో. విషయమేంటంటే.. అనుకోకుండా ఓ మొక్కను తగిలిన కారణంగా ఓ యువకుడి పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఆలివర్ ఫెంటన్ అనే యువకుడు తోటలో పనిచేసుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడే ఉన్న ఓ మొక్కను అనుకోకుండా తగిలి, రాసుకుంటూ వెళ్లాడు. అలా జరిగిన కొద్ది గంటల వరకు అతడికి ఏమీ అవ్వలేదు. ఆ తర్వాత అతడి ఒళ్లంతా అగ్గి మంటలు మొదలయ్యాయి. శరీరం మొత్తం ఎర్రటి పొక్కులు రాసాగాయి. కంటిలో సైతం ఆ మొక్కకు సంబంధించిన ద్రవం పడటంతో విపరీతంగా నొప్పి మొదలైంది. దీంతో అతడు వెంటనే ఆసుపత్రికి బయలుదేరి వెళ్లాడు.
ఆలివర్‌కు వైద్యం చేసిన డాక్టర్ మాట్లాడుతూ.. ఆలివర్ అదృష్టం కొద్ది కన్ను కోల్పోలేదని, లేకుంటే మొక్క స్రవించిన ద్రవం కారణంగా అతడి కంటిచూపుకు ప్రమాదం వాటిల్లేదని తెలిపారు. జెయింట్ హాగ్‌వీడ్ మొక్కలు చాలా ప్రమాదకరమైనవని, మానవ శరీరం దానికి తగిలినపుడు విషపూరితమైన ద్రవాలను మనిషి శరీరంలోకి జొప్పిస్తాయని తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment