
టెహ్రాన్: ఇరాన్ రాజధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్‌లోని ఓ మెడికల్ క్లినిక్‌లో మంగళవారం గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో క్లినిక్‌లో 25 మంది సిబ్బంది ఉన్నట్లు టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ రెజా గౌదర్జీ తెలిపారు. రెండు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్..)
కాగా ఇరాన్‌లో ఇది రెండవ ఘటన అని గతవారం కూడా టెహ్రాన్ సమీపంలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి సైనిక ప్రదేశానికి సమీపంలో ఉన్న గ్యాస్ నిల్వ కేంద్రం వద్ద ట్యాంకర్ పేలీ మంటలు చెలరేగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందన్న దానిపై సమాచారం లేదు.