55 కోట్ల గంటలు పని చేస్తున్నారు...
వాషింగ్టన్: ఆధునిక ప్రపంచంలో కూడా ఆడ పిల్లల పట్ల పిన్న వయస్సు నుంచే లింగ వివక్ష కొనసాగుతోంది. చేసే పనులను బట్టే కాకుండా వాళ్లుచేసే పని గంటలను బట్టి కూడా లింగ వివక్ష ఎంతో ఉంటోంది. ఐదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఆడ పిల్లలు 55 కోట్ల గంటలపాటు ఇంటిపనులు చేస్తుంటే వారికన్నా అదే వయస్సు గల మగ పిల్లలు 16 కోట్ల తక్కువ గంటల పనులు చేస్తున్నారని యునిస్కో తాజా నివేదికలో వెల్లడించింది.
ఐదు నుంచి తొమ్మిదేళ్ల వయస్సుగల ఆడపిల్లలు వారానికి సగటున నాలుగు గంటలు ఇంటి పనులు చేస్తుండగా, అదే పది నుంచి 14 ఏళ్ల ఆడ పిల్లలు వారానికి సగటున తొమ్మిది గంటలు పనిచేస్తున్నారు. వీళ్లు ఎక్కువగా వంట, పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట చెరకు సమీకరించడం, పిల్లలను ఆడించడం లాంటి పనుల్లో గడుపుతున్నారు. ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఆడపిల్లలు ఎక్కువ గంటలపాటు పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే సోమాలియాలో ఆడ పిల్లలు ఎక్కువ గంటలు పనిచేస్తుండగా, అదే దేశంలో ఆడ పిల్లలు, మగ పిల్లలు పనిచేసే గంటల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది.
ఆ తర్వాత ఆడపిల్లలు ఎక్కువ గంటలు పనిచేస్తున్న దేశాల్లో ఇతియోపియా, రువాండ, చాడ్, గినియా, బుర్కినాఫాసో, యెమెన్, బురుండి, సెనగల్, నిగర్ దేశాలు ఉన్నాయి. ఆడపిల్లలు, మగ పిల్లల పనిగంటల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్న దేశాల్లో సోమాలియా తర్వాత బుర్కినా ఫాసో, యెమన్, సెనగల్, చాడ్, బంగ్లాదేశ్, గినియా, కమోరస్, కాంగోలాంటి దేశాలున్నాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా మగ పిల్లల ఇంటి పనికి ఇస్తున్న విలువను ఆడపిల్లల పనికి ఇవ్వడంలేదని యునెస్కో నివేదిక వెల్లడించింది.
చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు ఎక్కువగా పనిచేస్తున్న ఈ దేశాల్లోనే ఎక్కువగా ఆడ పిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేస్తున్నారు. వంటపని, ఇంటి పనితోపాటు పిల్లల ఆలన కూడా వచ్చుగనుక 17, 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇలా త్వరగా పెళ్లి చేయడానికి ఒకరికి పెట్టే తిండి ఖర్చు తగ్గుతుందన్న భావన కూడా ఒక కారణం. ఖర్చు వేరే ఇంటికి మారుతుంది తప్ప తేడా ఉండదు. 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు గణాంకాలను తీసుకొని ‘హార్నెసింగ్ పవర్ ఆఫ్ డేటా గర్ల్స్’ పేరిట యునిస్కో ఈ నివేదికను విడుదల చేసింది.