'డాట్సన్ గోను ఉపసంహరించండి'
భారతీయ మార్కెట్ల నుంచి 'డాట్సన్ గో' బ్రాండు కార్లను వెంటనే ఉపసంహరించాలని, అది ఏమాత్రం సురక్షితం కాదని అంతర్జాతీయ వాహన భద్రతా సంస్థ ఒకటి తెలిపింది. ఇటీవల జర్మనీలో డాట్సన్ గో, మారుతి స్విఫ్ట్ కార్లకు గ్లోబల్ ఎన్క్యాప్ అనే సంస్థ భద్రతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించింది. కారు ముందువైపు నుంచి దేన్నయినా ఢీకొంటే పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలించారు.
అయితే రెండు కార్లూ ఈ పరీక్షలో విఫలమయ్యాయి. దాంతో గ్లోబల్ ఎన్క్యాప్ నిర్వాహకులు నిస్సాన్ కంపెనీ సీఈవోకు ఓ లేఖ రాశారు. ఐక్యరాజ్యసమితి విధించిన భద్రతా ప్రమాణాలను ప్రస్తుతం ఉన్న ఈ కారు ఏమాత్రం అందుకోలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కారును భారతీయ మార్కెట్ల నుంచి వెంటనే ఉపసంహరించడమే మేలని ఆ లేఖలో సూచించారు. టాటా నానో సహా మరికొన్ని కార్లను కూడా పరీక్షించినా, ఏ ఇతర కంపెనీ సీఈవోకు ఇలా మార్కెట్ నుంచి ఉపసంహరించాలని మాత్రం సూచించలేదు.