11 ఏళ్లకే 'మగాళ్లు' అయ్యారు..!
సాక్షి, ప్రత్యేకం: 'సంపాదించడం పురుష లక్షణం' అనేది సామెత. 11 ఏళ్ల వయసులోనే భారీగా సంపాదిస్తున్న ఇద్దరు పిల్లలు తాము 'మగాళ్ల' అయ్యామని అంటున్నారు. పదకొండేళ్ల ప్రాయంలో సాధారణ పిల్లలు ఏం చేస్తారు?. స్కూల్‌కు వెళ్తారు. ఆడి పాడతారు. కానీ, ఇంగ్లండ్‌లోని ఎసెక్స్ కౌంటీకి చెందిన అబ్రహం, జానీ మాత్రం అందుకు భిన్నం. ఇరువురికీ ఓ లక్ష్యం ఉంది. 'కేజ్ ఫైటర్స్' అవ్వాలనేది వారి ఆశ. అందుకోసం ఇప్పటినుంచే ప్రాక్టీస్ ఆరంభించేశారు.
వారి తండ్రి చేసే పనిలో సాయపడుతూ, గుర్రాలు, కార్ల అమ్మక వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. వచ్చిన డబ్బును సొంతగా జిమ్ నిర్మించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ కిడ్స్ గురించి అమెరికాలోని ఓ టీవీ చానెల్ Gypsy Kids అనే ప్రోగ్రామ్‌ను కూడా చేసింది. ఆ చానెల్‌తో మాట్లాడిన అబ్రహం.. తాము 'మగాళ్లు'గా మారామని అనిపిస్తుందని చెప్పాడు.
ప్రస్తుతం తాము స్కూల్‌కు వెళ్తూనే సంపాదిస్తున్నామని తెలిపాడు. వాళ్ల తాతయ్య నుంచి గుర్రాలు, కార్ల అమ్మకం ఎలా చేయాలో నేర్చుకున్నామని వెల్లడించాడు. తమకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఓ కేజ్ ఫైటర్‌ను చూసి స్ఫూర్తి పొందామని, తాము కూడా కేజ్ ఫైటర్స్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు అబ్రహం.