సింగపూర్: స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు కెమెరా, స్క్రీన్, బ్యాటరీ వంటి వాటితోపాటు ఏయే సెన్సర్లు ఉన్నాయో చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్ సెన్సర్‌లతో పాటు ఇతర సెన్సర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. అయితే ఈ సెన్సర్లు చాలా ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సెన్సర్ల సమాచారంతో పాస్‌వర్డ్స్, పిన్ నంబర్లను తేలికగా కనుక్కోవచ్చని చెబుతున్నారు.
ఈ సమాచారాన్ని ఉపయోగించి హ్యాకర్లు ఫోన్ అన్‌లాక్ చేయగలరని సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో భారత సంతతి శాస్త్రవేత్త కీలకపాత్ర పోషించారు. దీనిలో భాగంగా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్, ఫోన్‌లోని ఆరు సెన్సర్ల సమాచారాన్ని ఉపయోగించి ఫోన్‌ను శాస్త్రవేత్తలు అన్‌లాక్ చేశారు. అది కూడా 99.5 శాతం కచ్చితత్వంతో కేవలం మూడు ప్రయత్నాల్లోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయగలిగామని వివరించారు. ఇంతకుముందు ఫోన్ అన్‌లాక్ చేయగలిగే రేటు 74 శాతంగా ఉండేది. మనం ఫోన్ కీబోర్డులో పాస్‌వర్డ్స్‌ని ఎంటర్ చేసే సమయంలో ఫోన్‌లో కలిగే కదలికలను ఈ సెన్సర్లు సమాచార రూపంలో నమోదు చేసుకుంటాయి. ఈ సమాచారంతోనే ఫోన్ అన్‌లాక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment