తండ్రి ఉగ్రజాడల్లో.. | Hamza bin Laden: The Heir to Al-Qaeda? | Sakshi
Sakshi News home page

తండ్రి ఉగ్రజాడల్లో..

Published Wed, Sep 20 2017 2:09 AM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

తండ్రి ఉగ్రజాడల్లో.. - Sakshi

తండ్రి ఉగ్రజాడల్లో..

► జిహాదీలను ఏకం చేస్తున్న ఒసామా వారసుడు
► ధ్రువీకరిస్తున్న అమెరికా నిఘా వర్గాలు, నిపుణులు


పారిస్‌: అంతమైపోయిందనుకుంటున్న అల్‌కాయిదా మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోందా? ఒసామా అంతమయ్యాక అస్తిత్వంకోసం పోరాడుతున్నా పూర్తిస్థాయిలో దక్షిణాసియాపై పట్టుకోసం ప్రయత్నిస్తోందా? ఇన్నాళ్లూ నాయకత్వలేమి.. ఒసామాతో ఉన్న సన్నిహితులు కొందరు ఐసిస్‌ వైపు వెళ్లడంతో దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లైంది. గతవారం అమెరికాపై ఉగ్రదాడికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌కాయిదా విడుదల చేసిన ఓ ఫొటో అల్‌కాయిదా పునరుజ్జీవం దిశగా అడుగులేస్తోందనే వాదనలకు బలం చేకూరుస్తోంది.

ఈ చిత్రంలో ఓవైపు డబ్ల్యూటీసీ టవర్స్‌ కూలిపోతున్న దృశ్యం, మరోవైపు కుమారుడు హమ్జాతో కలసి ఒసామా కూర్చున్నారు. అప్పటి బాలుడైన హమ్జా ఇప్పుడు 28 ఏళ్ల యువకుడిగా తండ్రి స్థాపించిన ఉగ్రసంస్థను ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా గూఢచార సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.  ఒసామా ఉన్న పాత చిత్రాన్ని చాలా రోజుల తర్వాత తెరపైకి తేవటం వెనక ఉద్దేశం అల్‌కాయిదా పునరాగమనం కోసమేనని అంతర్జాతీయ విశ్లేషకుల భావన.

జిహాదీల ఐక్యతే లక్ష్యంగా...
ఒసామా మరణం తర్వాత ఆయన సన్నిహితులు కొందరు అల్‌కాయిదాను వీడినా.. హమ్జాతో కలసి మరికొందరు బలహీనమైన సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జిహాదీలను ఏకం చేయటంలో హమ్జా కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఐసిస్‌ మిలటరీ బలహీనపడుతున్న నేపథ్యంలో అల్‌కాయిదాను బలోపేతం చేసే వ్యూహాలతో హమ్జా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

‘తన తండ్రి స్థాపించిన సంస్థను నడిపేందుకు హమ్జా పూర్తి సన్నద్ధతకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఒసామా వారసుడిగా జిహాదీల్లో ఐకమత్యం తీసుకురావటంలో ఆయనకు సానుకూల అవకాశాలున్నాయి. ఐసిస్‌ పతనమవుతున్న తరుణంలో అంతర్జాతీయ జిహాదీ ఉద్యమానికి హమ్జా నాయకత్వం వహించే అవకాశం ఉంది. తండ్రిని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ ఉగ్రవాదులను ఆకర్షిస్తున్నాడు’ అని ఎఫ్‌బీఐ మాజీ ప్రత్యేక ఏజెంట్, అల్‌కాయిదా స్పెషలిస్టు అలీ సౌఫాన్‌ ఉగ్రవాద పోరాట కేంద్రం (సీటీసీ) ప్రచురించిన రిపోర్టులో పేర్కొన్నారు.

అబోట్టాబాద్‌కు ప్రతీకారంగా
ఒసామా మూడో భార్య కుమారుడైన హమ్జా.. మొత్తం 20 మంది సంతానంలో 15వ వాడు. చిన్నప్పటినుంచే తండ్రినే అనుసరించాడు. ఆయుధాల వినియోగం నేర్చుకున్నాడు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి ముందు రోజు ఒసామా నుంచి దూరంగా ఈయన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత తండ్రి కలవలేదు. భార్యలు,సోదరులను తీసుకుని అఫ్గాన్‌ అక్కడినుంచి ఇరాన్‌కు లాడెన్‌ వెళ్లిపోయాడు. ఒసామా తయారుచేసిన గూఢచార వ్యవస్థతో నిరంతరం తండ్రితోపాటుగా జిహాదీలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు.

ఒసామాను ఎన్‌కౌంటర్‌ చేసిన పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌ ఇంట్లో కొన్ని లేఖలు దీన్ని బలపరుస్తున్నాయి. 2015లో విడుదల చేసిన ఓ ఆడియో సందేశంలో కాబూల్‌ నుంచి బాగ్దాద్‌ వరకు, గాజా నుంచి వాషింగ్టన్, లండన్, పారిస్, టెల్‌ అవివ్‌ వరకు జిహాదీలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చాడు. హమ్జా హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న అమెరికా.. జిహాదీల్లో ఈయనకు పెరుగుతున్న ఆదరణ వాస్తవమేనని గుర్తించి అంతర్జాతీయ ఉగ్రవాదుల బ్లాక్‌లిస్టులో పేరు చేర్చింది. పశ్చిమాసియాలో హమ్జా ప్రభావం పెరుగుతోందని తేల్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement