జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..?
జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ఎలాగని ఆలోచిస్తున్నారా.. అదేమంత కష్టం కాదు. బాగా చదువుకున్న నాలుగు గంటల తర్వాత వెళ్లి వ్యాయామం చేస్తే చాలు.. దీర్ఘకాలంలో మీ జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుందట. ఈ విషయాన్ని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చదివిన నాలుగు గంటల తర్వాత ఇలా వ్యాయామం చేస్తే, దానికి ముందు చదివిన విషయం రెండు రోజుల పాటు అలాగే గుర్తుండిపోతుందని, చేయని వాళ్లు మాత్రం త్వరగా మర్చిపోతున్నారని శాస్త్రవేత్తలు అన్నారు. మెదడులో నేర్చుకోడానికి, జ్ఞాపకశక్తికి కీలక కేంద్రమైన హిప్పోక్యాంపస్ మీద వ్యాయామం మంచి ప్రభావం చూపుతుంది.
దానివల్ల జ్ఞాపకశక్తిని కేంద్రీకరించుకోవడం, దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తిని పెంచుకోవడం వీలవుతుందని నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ యూనివర్సిటీకి చెందిన గిల్లెన్ ఫెర్నాండెజ్ చెప్పారు. 72 మంది విద్యార్థుల మీద చేసిన పరిశోధనల ఆధారంగా చదువుకున్న నాలుగు గంటల తర్వాత వెళ్లి వ్యాయామం చేస్తే జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గ్రహించినట్టు ఫెర్నాండెజ్ తెలిపారు.