చంద్రుడి బిలాలే ఆవాసాలు..
వాషింగ్టన్: చంద్రుడిపై ఉండే పెద్ద పెద్ద బిలాలే భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములకు ఆవాసాలు కానున్నాయి. చంద్రుడిపై రేడియేషన్, దుమ్ము, ఉష్ణోగ్రతల్లో తీవ్ర తారతమ్యాల నుంచి వారికి రక్షణకోసం ఆ బిలాలను వినియోగించుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. లూనార్ రీకన్నేస్సన్స్ ఆర్బిటార్ (ఎల్‌ఆర్‌వో) తీసిన చిత్రాలను ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ సహాయంతో పరిశీలించి ఈ బిలాలను కనుగొన్నట్లు చెబుతున్నారు.
అయితే చంద్రుడి ఉపరితలంపై దాదాపు 200కు పైగా పెద్దపెద్ద బిలాలున్నాయి. ఈ బిలాలు దాదాపు గుహల్లాగా వినియోగించుకోవడానికి వీలుగా ఉన్నాయని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త రాబర్ట్ వాగ్నర్ చెప్పారు. లావా ప్రవహించడం మూలంగా ఖాళీలు ఏర్పడి ఉంటాయని.. ఆ తర్వాత ఆ ఖాళీల పైన ఉండిపోయిన మట్టిపొర కూలిపోవడంతో బిలాలు ఏర్పడి ఉంటాయని పేర్కొన్నారు. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు వీటిల్లో ఆవాసాలను ఏర్పరచుకుంటే.. అక్కడి దుర్భర పరిస్థితుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు.