
చిలుకా.. క్షేమమా!
పచ్చని చిలుకలు తోడుంటే.. అంటూ పాట పాడుకుంటాం. అంటే చిలుకలంటే పచ్చగానే ఉంటాయని మనకు తెలుసు. సర్కస్‌లలో, సినిమాల్లో ఒక్కోసారి రంగురంగుల చిలుకలు దర్శనమిస్తాయి. కానీ ఎప్పుడైనా నీలిరంగు చిలుకను చూశారా? ఈ అరుదైన చిలుక జాతిని శాస్త్రవేత్తలు మెక్సికోలో గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు అమెజాన్ ప్రాంతంలో ఈ చిలుకలను గుర్తించారు.
ఈ చిలుకలలో అనేక ప్రత్యేక లక్షణాలున్నాయట. మనదగ్గర ఉండే పచ్చని చిలుకల కంటే ఇవి పెద్దగా అరుస్తాయట. అది కూడా ఒకే రకమైన శబ్దం చేస్తూ మళ్లీ మళ్లీ అరుస్తాయట. అంతేగాక ఇవి చిన్న గుంపులుగా జీవిస్తాయని, ఒక్కో గుంపులో 10 నుంచి 12 చిలుకలు ఉంటాయని చెప్పారు. శాకాహారులైన ఈ పక్షులు పండ్లు, పువ్వులు, ఆకులు, విత్తనాలను ఇష్టంగా తింటాయని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి మైటోకాండ్రియాలోని జన్యు క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సుమారు 1,20,000 సంవత్సరాల క్రితమే ఈ జాతి ఆవిర్భవించిందని గుర్తించారు.