చిన్నారి పెళ్లికూతురితో 65 ఏళ్ల వృద్ధుడి పెళ్లి!
బాల్యవివాహాలపై ప్రజల స్పందన ఎలా ఉంటుంది. ఏమో చాలా సందర్భాల్లో ముక్కుపచ్చలారని పసిపిల్లలను కాటికి కాళ్లు చాపుకొన్న వృధ్దులకు కట్టబెట్టినా.. అలాంటి పెళ్లిళ్లకు వెళ్లి.. అక్షింతలు వేసి పప్పన్నం తినొచ్చేవాళ్లే చాలామంది ఉంటారు. కొందరు మాత్రం ఏమిటి దారుణమని ప్రశ్నిస్తారు. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది.
65 ఏళ్ల వృద్ధ వరుడు, 12 ఏళ్ల ముక్కుపచ్చలారని వధువు.. న్యూయార్క్ వీధుల్లో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. టైమ్స్ స్క్వేర్ వద్ద వివాహ దుస్తుల్లో చూడటానికే వింతగా ఈ జంట ఫొటోలు తీసుకుంటుండగా ప్రజలు చాలామంది బిత్తరపోయి చూశారు. ఈ వికృత వ్యవహారాన్ని చూసి చాలామంది ముఖకవళికలు మారిపోయాయి. కొందరు ఈ దారుణాన్ని చూడలేక అక్కడి నుంచి మౌనంగా తప్పుకొన్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఓ మహిళ కంటతడి పెడుతూ కనిపించింది. ఓ యువతి ముందుకొచ్చి 'మీ అమ్మేది' అంటూ చిన్నారి పెళ్లికూతురిని ప్రశ్నించింది. ఆమె తల్లిదండ్రుల అనుమతితోనే తాను ఈ పెళ్లి చేసుకుంటున్నట్టు వృద్ధ వరుడు సెలవిచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె అతణ్ని చెడామడా తిట్టేసింది.
మరో వ్యక్తి అయితే ఈ రోత పెళ్లి తంతును చూసి గాబారా పడ్డాడు. ఆందోళన చెందాడు. వరుడితో ఏకంగా గొడవకు దిగాడు. దీంతో సెక్యూరిటీ వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. ఇంతమందిలో ఆగ్రహాన్ని, దిగ్భ్రమను కలిగించిన ఈ వ్యవహారం.. నిజానికి నిజం కాదు. చాలా దేశాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో న్యూయార్క్‌లో ఈ తంతు జరిగితే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి యూట్యూబ్‌కు చెందిన కాబీ పెర్సిన్ గ్రూప్ ఈ సామాజిక ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నటులైన 65 ఏళ్ల వ్యక్తి, 12 ఏళ్ల బాలిక నూతన వధూవరులుగా కనిపించగా.. ఈ రియాల్టీ ఎక్స్‌పెరిమెంట్‌పై ప్రజల నుంచి పెద్దస్థాయిలోనే ఆగ్రహం, ఆందోళన వ్యక్తమయ్యాయి. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది.