బ్రిటన్‌ను కోరుతున్న హైదరాబాదీ!
మహిళ అయినా పురుషుడిగా జీవించాలనే కోరిక
భారత్‌లో ఆ అవకాశం లేదంటూ ఆవేదన
లండన్: జన్మతః మహిళ అయినా పురుషుడిగా జీవించడానికి ఇష్టపడుతున్న ఒక హైదరాబాదీ బ్రిటన్‌లో శరణు వేడుకుంటోంది. తనను తిరిగి భారత్‌కు పంపిస్తే అక్కడ వేధింపులు, ప్రాణానికి ప్రమాదమని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమీర్ నీలం ఇంగ్లండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌కు పారిపోవడానికి ముందు హైదరాబాద్‌లో ఒక మహిళతో కలిసి జీవించింది. అయితే, ఆ సమయంలో తాను పురుషుడినంటూ రహస్య జీవనం సాగించింది. అలాగే ఉండాలని ఆమె కోరుకున్నా అది దాగలేదు. ఈ విషయాన్ని భారతీయ మీడియా వెలుగులోకి తేవడంతో తాను హింసకు, వేధింపులకు గురయ్యానని సమీర్ పేర్కొంది. ‘‘ఇక్కడ నేను కోరుకున్నట్లుగా ఉండవచ్చు. భారత్‌లో ఇలాంటి వస్త్రాలను ధరించలేను. నన్ను అక్కడ ఎవరూ పురుషుడిలా చూడరు. ఒకవేళ నేను పురుషుడినని భారత్‌లో బహిరంగంగా చెప్పుకుంటే తక్కువ చేసి చూస్తారు. వేధిస్తారు, పక్షపాతంతో చూస్తారు. బహిష్కరిస్తారు’’ అంటూ ఆమె తన భయాందోళనను బీబీసీ చానల్‌కు తెలియజేసింది.
పురుషుడిలా ఉండడాన్ని తాను ఎంతో ఆనందిస్తానని, ‘మిష్టర్ లేదా అతడు’ అని పిలిస్తే తనకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని ఆమె పేర్కొంది. బ్రిటిష్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా తన వాస్తవిక లేదా మార్పిడి చేసుకున్న లింగనిర్ధారణ ఆధారంగా వేధింపులకు గురవుతాననే భయంతో ఉంటే ఆశ్రయం కోరవచ్చు. దీనిపై ఓ బ్రిటన్ హోంశాఖ అధికారి మాట్లాడుతూ.. ఎవరికైనా ఆశ్రయం కల్పించే ముందు వారి దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. సమీర్ నీలం దరఖాస్తుకు రానున్న వారాల్లో బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తిరస్కరిస్తే ఆమెను భారత్‌కు పంపించేస్తారు.