అమెరికాలో మంచు తుపాను
బ్రిటన్ సహా యూరోప్ దేశాల్లోనూ తుపాన్లు 24 మంది మృతి
విద్యుత్ సరఫరాకు విఘాతం
అగస్టా (అమెరికా): అమెరికాలోని మధ్య, ఈశాన్య ప్రాంతాలతో పాటు కెనడాలోని తూర్పు ప్రాంతాన్ని మంచు తుపాను ముంచెత్తింది. తుపాను కారణంగా 24 మంది మరణించగా, ఉభయ దేశాల్లోనూ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలనూ తుపానులు అతలాకుతలం చేశాయి. ఫలితంగా 50 లక్షలకు పైగా జనాభా క్రిస్మస్ రోజున అంధకారంలోనే గడిపారు. తుపాను ప్రభావాన మరింతగా మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. విద్యుత్ సరఫరా లేనందున జనరేటర్లు వినియోగించి, వాటి నుంచి వెలువడిన విషవాయువు కారణంగా కెనడాలో ఐదుగురు మరణించారు.
మంచు తుపాను కారణంగా కెనడా తూర్పు ప్రాంతంలో జరిగిన వాహన ప్రమాదాల్లో మరో ఐదుగురు మరణించారు. అమెరికాలో 14 మంది మరణించారు. వారిలో ఇద్దరు జనరేటర్ల నుంచి వెలువడిన విషవాయుల కారణంగానే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మంచు తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. టొరంటోలో మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానిక సహాయక బృందాలు వారికి సహకరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలను కూడా తుపానులు ముంచెత్తుతున్నాయి.
బ్రిటన్‌లోని దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో దాదాపు 50 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపోయింది. బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలను భారీ వర్షాలు, పెనుగాలులు అతలాకుతలం చేశాయి. బొర్న్‌మౌత్ సమీపంలో స్టౌర్ నదికి వరదలు రావడంతో ఆ ప్రాంతం నుంచి 90 వేల మంది ప్రజలను బుధవారం వేకువ జామున సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తుపానుల కారణంగా విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడిందని వారు చెప్పారు.