డిజిటల్ ప్రపంచం చీకటైతే!
ప్రపంచమే ఓ గ్లోబల్ గ్రామంగా మారిన నేటి సమాజంలో కొన్ని తరాలుగా మనం డిజిటల్ ఫామ్‌లో భద్రపరుస్తున్న చారిత్రక,భౌగోళిక, శాస్త్ర విజ్ఞాన, సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించినవే కాకుండా మన వ్యక్తిగత జ్ఞాపకాలుకు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంట్లు ఒక్కసారిగా కంప్యూటర్ ప్రపంచ తెర మీది నుంచి మాయమైతే ఎలా ఉంటుంది? చరాచర ప్రపంచమంతా చీకటిమయంగా కనిపించదా, ఒక్కసారిగా చేష్టలుడిగి నిశ్చేష్టులంకామా? సరిగ్గా ఇదే సంశయం ఇంటర్నెట్ పితామహుడు వింట్ సర్ఫ్‌కు వచ్చింది. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోతే 21 శతాబ్దం చరిత్రను మన భవిష్యత్ తరాలకు ఎలా అందించగలమని ప్రస్తుతం గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌గావున్న వింట్ సెర్ఫ్‌లో ఓ అనూహ్య ప్రశ్న మొలకెత్తింది. శాన్‌జోస్‌లో ఇటీవల జరిగిన ‘అమెరికన్ ఆసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్’ వార్షిక సమావేశం వేదికపై వింట్ సెర్ఫ్ ఈ సరికొత్త ప్రశ్నను లేవనెత్తారు. అలాంటి పరిస్థితిని తలెత్తడాన్ని ‘డిజిటల్ డార్క్ ఏజ్’గా అభివర్ణించవచ్చని కూడా ఆయన అన్నారు. ఆ పరిస్థితి తలెత్తకుండా ప్రతి రంగానికి సంబంధించి మనం డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసిన యావత్ సమాచారాన్ని భారీ భారీ పురావస్తు భాండాగారాల్లో (ఆర్కీవ్స్)లో భద్రపరిచినా, అవేమిటో, వాటిని ఎలా శోధించాలో మన భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఉంటుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
కంప్యూటర్ రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా మన తరంలో వాడుతున్న హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు భవిష్యత్ తరంలో మనుగడలో ఉండవని, అలాంటప్పుడు ఇప్పటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లతో నిక్షిప్తం చేసిన సమాచారం భవిష్యత్ తరాలకు అందకపోయే ప్రమాదం ఉందన్నది స్థూలంగా వింట్ సెర్ఫ్ అభిప్రాయం. మన చరిత్రను చరిపేసే ప్రమాదానికి పరిష్కారం కనుగొనడమే తన ప్రస్తుత కర్తవ్యమని కూడా ఆయన అదే వేదికపై నుంచి చెప్పారు. వర్తమానంలో మనం వినియోగిస్తున్న ప్రతి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను ఏదోరూపంలో భద్రపర్చుకోవడం ఈ సమస్యకు పరిష్కారంగా కనిపిస్తోందని అన్నారు. ప్రతి అప్లికేషన్‌ను, ఆపరేటింగ్ సిస్టమ్‌ను, దానికి సంబంధించిన కాంటెంట్‌ను ‘ఎక్స్‌రే స్నాప్ ఫాట్’ రూపంలో కంప్యూటర్ మ్యూజియంలో భద్రపర్చడం ఉత్తమమార్గమని ఆయన సూచించారు. ఇలా భద్రపర్చడం సాధ్యమేనని కార్నీజ్ మెలన్ విశ్వవిద్యాలయానికి చెందిన మహదేవ్ సత్యనారాయణ నిరూపించి వింట్ సెర్ఫ్ సందేహాలకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు.